Share News

పొగాకు ధర పతనం

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:08 AM

వర్జీనియా పొగాకు ధర భారీగా పతనమయ్యింది. ఎంతగా అంటే.. కిలోకు రూ.450 నుంచి 200కు పడిపోయింది. ఆ ధరకు అయినా రైతులు తెచ్చిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయడం లేదు.

పొగాకు ధర పతనం

  • కేజీ రూ.450 నుంచి 200కి పడిపోయిన ధర

  • పెట్టుబడిలో సగం కూడా రాని పరిస్థితి

  • వేలాది మంది రైతులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం

  • కొనుగోళ్లు వేగవంతం చేస్తాం.. గిట్టుబాటు ధర దక్కేలా చూస్తాం: అచ్చెన్న

గుంటూరు సిటీ, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): వర్జీనియా పొగాకు ధర భారీగా పతనమయ్యింది. ఎంతగా అంటే.. కిలోకు రూ.450 నుంచి 200కు పడిపోయింది. ఆ ధరకు అయినా రైతులు తెచ్చిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయడం లేదు. వంద బేళ్లు తెస్తే.. పదే కొంటున్నారు. మిగిలిన వాటిని వచ్చిన ధరకు ప్రైవేటుగా అమ్ముకోవల్సి వస్తోంది. వ్యాపారులంతా కుమ్మక్కు అయిపోయారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గుంటూరు పొగాకు బోర్డు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్జీనియా పొగాకు పండించేందుకు రైతులకు అనుమతి ఇచ్చింది. ఒక్కో రైతు ఐదు ఎకరాల్లో పొగాకు సాగు చేసేందుకు లైసెన్స్‌లు మంజూరయ్యాయి. ఈ ఏడాది సుమారు 230 మిలియన్‌ కిలోల పొగాకు దిగుబడులు సాధించారు. పంట బాగా పండినప్పటికీ మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. గత ఏడాది కిలోకు రూ.350 నుంచి రూ.450 వరకు పలికిన ధర ఈసారి కేవలం రూ.200-250కే పరిమితమయ్యింది. ధరలు పడిపోవడమే కాకుండా వేలం కేంద్రాల్లో కొనుగోళ్ల తీరు కూడా రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. రైతులు తీసుకువస్తున్న ప్రతి 100 బేళ్లలో కేవలం 10 బేళ్లకే కొనుగోలు జరుగుతుండగా, మిగిలిన వాటిని నాణ్యత పేరుతో తిరస్కరిస్తున్నారు. దీనిని బయట ప్రైవేట్‌ వ్యాపారులు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పొగాకు సాగుకు ఎకరాకు సగటున రూ.2.50 లక్షలకు పైగా ఖర్చవుతుండగా, ప్రస్తుత ధరల ప్రకారం అమ్మితే.. పెట్టుబడిలో సగం కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వేలాదిమంది రైతులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని, ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వం జోక్యం లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


గిట్టుబాటు ధర దక్కేలా చూస్తాం: అచ్చెన్న

అమరావతి: వర్జీనియా పొగాకు రైతులు అన్ని రకాల గ్రేడులు వేలానికి తీసుకురావాలని, గిట్టుబాటు ధర దక్కేలా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గత నెలలో రోజుకు 150 బేళ్లు మాత్రమే కొనుగోళ్లు జరగ్గా, ప్రస్తుతం సగటున 700బేళ్లకు పెరిగాయని చెప్పారు. వచ్చే వారంలో రోజుకు 1,000-1,200 బేళ్లకు కొనుగోళ్లు చేరుకునే అవకాశం ఉందన్నారు. పొగాకు కొనుగోలు కంపెనీలు అవసరమైన గ్రేడ్ల వివరాలు తెలియజేసినందున పొగాకు బోర్డు కొనుగోలు లక్ష్యాలను నిర్ధేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అయ్యే పొగాకులో 30శాతం దేశీయ వినియోగానికి వెళ్తుండగా, 70ు ఎగుమతి అవుతున్నాయన్నారు. అంతర్జాతీయ పరిణామాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, రవాణా, షిప్పింగ్‌ కంటైనర్ల కొరత వంటి కారణాలతో ఎగుమతి రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిపారు. కంటైనర్‌ రవాణా ఖర్చు 1,600 నుంచి 4వేల డాలర్లకు పెరిగిందని, ఈ పరిస్థితుల్లో జీఎస్టీ భారంపై సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు.

వెయ్యి కోట్లు కేటాయించాలి

పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్రం రూ.500 కోట్లు కేటాయించి రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చెయ్యాలి. బోర్డు అనుమతితో పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చెయ్యకపోతే రైతులు నష్టపోతారు. ఈ విషయమూ వ్యవసాయ శాఖ మంత్రి సత్వరమే స్పందించాలి.

- కంచుమాటి అజయ్‌కుమార్‌,

రాష్ట్ర కమిటీ సభ్యుడు, రైతు సంఘం

Updated Date - Jun 10 , 2026 | 05:09 AM