Share News

మల్లన్న గర్భాలయ వీడియో వైరల్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:54 AM

ఉగాది పర్వదినాన ఓ భక్తుడు అత్యుత్సాహంతో శ్రీశైల మల్లికార్జున స్వామి గర్భాలయంలో జరుగుతున్న అభిషేక క్రతువును వీడియో తీశాడు. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వైరల్‌ చేశాడు

మల్లన్న గర్భాలయ వీడియో వైరల్‌

  • ఉగాది రోజు ఓ భక్తుడి అత్యుత్సాహం

  • సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌.. పోలీసులకు ఫిర్యాదు

శ్రీశైలం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినాన ఓ భక్తుడు అత్యుత్సాహంతో శ్రీశైల మల్లికార్జున స్వామి గర్భాలయంలో జరుగుతున్న అభిషేక క్రతువును వీడియో తీశాడు. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వైరల్‌ చేశాడు. బుధవారం అర్ధరాత్రి అగ్నిగుండ ప్రవేశం అయిన తరువాత గురువారం తెల్లవారుజుమున ఉగాది పర్వదినం సందర్భంగా ఆదిదంపతుల దర్శనం చేసుకునేందుకు వచ్చిన సోలాపూర్‌ పీఠాధిపతి సిద్ధరామేశ్వర స్వామీజీ వెంట కొందరు శిష్యులు కూడా వచ్చారు. మల్లన్న గర్బాలయంలో పీఠాధిపతి స్వామివారికి అభిషేకం చేసుకుంటున్న సమయంలో ఎదురుగా క్యూలైన్‌ వద్ద నిలుచున్న సదరు శిష్యుడు తన వెంట తెచ్చుకున్న మొబైల్‌ ఫోన్‌లో జరుగుతున్న తంతును చిత్రీకరించాడు. సాధారణంగా ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే అత్యవసర సమయంలో (గేట్‌ నెంబర్‌ 2) హరిహరరాయ గోపురం నుంచి ప్రవేశం కల్పిస్తుంటారు. ఈ క్రమంలో ముందస్తుగానే దర్శనానికి వచ్చే వీఐపీలు వారికి సంబంధించిన వారు కూడా సెల్‌ఫోన్లు ఆలయంలోకి తీసుకురాకూడదని హెచ్చరిస్తూనే ఉంటారు. అయినప్పటికీ శిష్యబృందంలో ఒకరు చేసిన అత్యుత్సాహంతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగడంతోపాటు దేవస్థానం నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులకు ఆలయ ముఖ్య భద్రతా అధికారి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Updated Date - Mar 21 , 2026 | 06:01 AM