Share News

ఆకివీడులో హైటెన్షన్‌!

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:05 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి పూజలు నిర్వహించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై...

ఆకివీడులో హైటెన్షన్‌!

  • పెదపేట రామాలయ నిర్మాణంపై వివాదం

  • రఘురామపై దాడికి యత్నం

  • జనసేన నేతలపై మేకులు, చాకులతో దాడి

  • 57 మందిపై కేసులు... 144 సెక్షన్‌ విధింపు

  • దళితుల ముసుగులో క్రైస్తవుల పని: రఘురామ

ఆకివీడు/భీమవరం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి పూజలు నిర్వహించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై ఆందోళనకారులు దాడికి యత్నించారు. ఆయనతోపాటు వచ్చిన జనసేన నాయకులపైనా కత్తులు, మేకులతో దాడి చేసి గాయపరిచారు. దళితుల ముసుగులో క్రైస్తవులు తమపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. పెదపేట రామాలయాన్ని ఈ నెల 8న రఘురామ సందర్శించారు. ఆరెస్సెస్‌ నాయకులు, హిందువుల కోరిక మేరకు శిథిలావస్థకు చేరిన ఆలయం స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్థానిక క్రైస్తవులు అభ్యంతరం తెలిపారు. అప్పటి నుంచే ఇక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడ పోలీసు పికెట్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో రాముడి విగ్రహానికి పూలమాల వేసేందుకు ఉదయం 10.45 గంటలకు రఘురామ వచ్చారు. ఆయన వెంట కూటమి నేతలు, భజరంగదళ్‌, హిందూ సంఘాల నేతలు 80మంది వరకూ ఉన్నారు. రఘురామ రాకను వ్యతిరేకిస్తూ దాదాపు 500 మంది ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. వారికి కూటమి నేతలు, పోలీసులు చాలాసేపు నచ్చజెప్పారు. చివరకు పోలీసుల సహకారంతో 11.25 గంటలకు రఘురామ ఆలయంలోకి వెళ్లి పూజలు చేశారు.

Untitled-2 copy.jpg


ఈ సమయంలో కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న ఆయనపైనా దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకొని, ఆయన్ను అక్కడినుంచి పంపేశారు. రఘురామ వెంట ఉన్న జనసేన నాయకుడు గవర(జిమ్‌) అనిల్‌ తలపైనా, మరో నాయకుడు వెజ్జు నాగసాయి వీపుపైన చాకు, మేకులతో దాడిచేశారు. అలాగే బొడ్డు సాయికృష్ణ, నాయుడు అయ్యప్ప, షేక్‌ మున్నా, కొటికలపూడి సాయిపై దాడులు చేశారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ దాడులకు సంబంధించి 57మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఆకివీడులో 144 సెక్షన్‌ విధించారు. క్షతగాత్రులను భీమవరం ఆస్పత్రిలో రఘురామ పరామర్శించారు. కాగా, గురువారం రాత్రి నుంచే ఇతర ప్రాంతాల నుంచి కొందరు పెదపాడు వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మేకులు, చాకులు, రాడ్లు, కత్తులు సిద్ధం చేసుకున్నారు.


పక్కా ప్లాన్‌తోనే దాడి: రఘురామ

పెదపేటలో దళితుల ముసుగులో క్రైస్తవులు పక్కా ప్లాన్‌తో తమపై దాడికి దిగారని రఘురామ ఆరోపించారు. ‘‘. ఇందులో పెద్ద కుట్ర ఉంది. కత్తులు, మేకులతో దాడికి పాల్పడ్డారు. స్థానికులతో పాటు బయటనుంచి వచ్చిన వ్యక్తులు కలిసి దాడిచేశారు. నా కారు అద్దాలు ధ్వంసం చేశారు. జనసేన నాయకుల తలలో మేకులు దింపారు. దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షిస్తాం. అన్యమతస్థులు అనుమతిస్తేనే గానీ శ్రీరాముడి దేవాలయానికి వెళ్లి దండ వేయలేని దుస్థితిలో ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు.

బాధ్యులను కఠినంగా శిక్షించాలి: డిప్యూటీ సీఎం

రఘురామకృష్ణరాజు, ఆయన అనుచరులు, జనసేన నాయకులపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీస్‌ శాఖకు పవన్‌ సూచించారు. కాగా, రఘురామరాజుపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌ విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Updated Date - Mar 28 , 2026 | 04:07 AM