Share News

పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తున్నాం!

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:24 AM

ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలు సహా ఓ తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త తరఫు బంధువులు చెబుతున్నా..

పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తున్నాం!

  • ఇద్దరు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద మృతి

  • వినుకొండ మండలంలో పెను విషాదం

వినుకొండ, జూలై 14(ఆంధ్రజ్యోతి): ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలు సహా ఓ తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త తరఫు బంధువులు చెబుతున్నా.. ఆమె అంత పిరికిది కాదని మృతురాలి బంధువులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నక్కా భారతి (24), సునీల్‌రెడ్డి దంపతులకు తేజేశ్‌రెడ్డి(6) హేమనాథరెడ్డి(4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భారతి మూడేళ్ల వయసులో ఉండగా తన తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఆమెను మేనమామ నక్కా నాగిరెడ్డి పెంచి, వారి పెదనాన్న కొడుకైన సునీల్‌రెడ్డికిచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో భారతి దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏమి జరిగిందో ఏమోగానీ.. మంగళవారం ఇద్దరు పిల్లలతో కలిసి భారతి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ‘మేము పరమేశ్వరుని దగ్గరకు వెళ్తున్నాం, ఎలాంటి ఒత్తిళ్లూ లేవు’ అంటూ భారతి రాసినట్లు ఉన్న ఓ సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ ప్రభాకరరావు తెలిపారు.


ఆత్మహత్య కాదు.. హత్యే!

పిల్లలకు భారతి విషమిచ్చి తాను కూడా విషం తాగి చనిపోయిందని కొందరు, దిండుతో చిన్నారులను చంపి ఫ్యాన్‌కు ఉరివేసుకుందని మరికొందరు చెబుతున్నారు. ఈ ఘటన ఆత్మహత్యగా ప్రచారంలోకి రాగా, మృతురాలి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది ఆత్మహత్య కాదని, భర్త సునీల్‌రెడ్డి, అతడి తల్లిదండ్రులే పక్కా పథకం ప్రకారం విషప్రయోగం చేసి ముగ్గుర్నీ హత్య చేశారని ఆరోపించారు. సూసైడ్‌ లేఖలో ఉన్న రాత భారతిది కాదని మృతురాలి అన్న యర్రం తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. తన చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముందే ముగ్గుర్నీ చంపేసి, ఆపై తప్పుదారి పట్టించేందుకు ఉరివేసినట్లు నాటకమాడుతూ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 15 , 2026 | 05:25 AM