Share News

వ్యక్తిగత కక్షతోనే విలేకరి జగన్‌ హత్య

ABN , Publish Date - May 18 , 2026 | 04:49 AM

చిత్తూరు జిల్లా వి.కోట ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి జగన్మోహన్‌రెడ్డి (జగన్‌)ని వ్యక్తిగత కక్షతోనే తమీమ్‌ హత్య చేశాడని సీఐ సోమశేఖర్‌రెడ్డి చెప్పారు. తన మేనత్త కొడుకు సుభాన్‌తో కలిసి చంపేశాడని..

వ్యక్తిగత కక్షతోనే విలేకరి జగన్‌ హత్య

  • ఈ కేసులో మరో ఇద్దరి అరెస్టు: సీఐ

రామకుప్పం, మే 17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి జగన్మోహన్‌రెడ్డి (జగన్‌)ని వ్యక్తిగత కక్షతోనే తమీమ్‌ హత్య చేశాడని సీఐ సోమశేఖర్‌రెడ్డి చెప్పారు. తన మేనత్త కొడుకు సుభాన్‌తో కలిసి చంపేశాడని, తర్వాత బెంగళూరు పారిపోయినట్లు తెలిపారు. ఆదివారం సాయత్రరం చిత్తూరు జిల్లా వి.కోట పోలీసు స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో వారెంటు పెండింగ్‌లో ఉన్న గంజాయి కేసులో ఆ ఇద్దరూ లొంగిపోయారని.. ఈ నెల 7న పీటీ వారెంటు ద్వారా వారిద్దరినీ తీసుకొచ్చి పలమనేరు కోర్టులో హాజరుపరచి, రిమాండ్‌కు తరలించామని చెప్పారు. 12న నిందితులిద్దరినీ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని ఐదు రోజుల పాటు విచారించామన్నారు. ‘గతంలో వి.కోటకు చెందిన ఆరిఫ్‌ చెల్లెలికి, విక్కీ అనే వ్యక్తికి కుటుంబ తగాదాలు వచ్చాయి. ఈ తగాదాల్లో జగన్మోహన్‌రెడ్డి ఆరిఫ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో తమీమ్‌ 5కిలోల గంజాయిని ఆరిఫ్‌ వద్ద ఉంచి బెంగళూరు పోలీసులకు పట్టించాడు. అతడు నిర్దోషి అని జగన్‌ నిరూపించారు. తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన తమీమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.


వి.కోటలో ఏడాదిన్నర కిందట జరిగిన మత ఘర్షణల్లో ఓ వర్గాన్ని రెచ్చగొట్టారన్న కారణంగా అతడిపై మూడు కేసులు పెట్టి, జైలుకు పంపాం. రౌడీషీట్‌ కూడా తెరిచాం. దీంతో తమీమ్‌ కర్ణాటక సరిహద్దు గ్రామం తాయలూరుకు మకాం మార్చాడు వి.కోటలో బీఎస్పీ నేత శ్రీనివాసులు.. స్థానికంగా భూవివాదాల వంటి పంచాయితీల్లో పాల్గొనేవాడు. ఈ విషయాల్లో తనకు జగన్‌ అడ్డుగా ఉన్నాడని అతడు భావించాడు. గతనెల 14న తమీమ్‌ ఇంటికి వెళ్లి జగన్‌ను మట్టుపెడితే.. తర్వాత జరిగే పరిణామాలను తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. 28న స్నేహితుడితో కలిసి జగన్‌ వాకింగ్‌ చేస్తుండగా.. తమీమ్‌, సుభాన్‌ దాడిచేసి హతమార్చారు. హత్యకు ముందు, తర్వాత నిందితుల కదలికల సీసీ ఫుటేజీలను సేకరించాం. వారే హత్య చేసినట్లు ఆధారాలున్నాయి. ఇంకా ఎవరైనా సహకరించారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం. బీఎస్పీ నేత శ్రీనివాసులుతో పాటు సలీమ్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు పంపాం. నిందితులందరినీ మరోసారి కస్టడీకి తీసుకుని విచారిస్తాం’ అని సీఐ వివరించారు.

Updated Date - May 18 , 2026 | 05:50 AM