Share News

1 నుంచి వీబీజీ రామ్‌జీ అమలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:06 AM

రెండు దశాబ్దాల తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో అతిపెద్ద మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో అమల్లోకి రానున్న.....

1 నుంచి వీబీజీ రామ్‌జీ అమలు

  • రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ విడుదల

  • ఒక్కో కుటుంబానికి 125 పనిదినాలు

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాల తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో అతిపెద్ద మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో అమల్లోకి రానున్న వికసిత్‌ భారత్‌-గ్యారెంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌(గ్రామీణ్‌ వీబీ జీరామ్‌ జీ) చట్టానికి సంబంధించిన ముసాయిదా నియమాలను కేంద్రం గెజిట్‌ ద్వారా గతనెల 22న విడుదల చేసింది. జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రకటించింది. ఈ మేరకు పథకం అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ జీఓ.78ను విడుదల చేసింది. కొత్త చట్టంలో గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి వంద రోజుల పనిదినాల స్థానంలో 125 రోజుల ఉపాధి పనిదినాలు కల్పించనున్నారు. గతంలో కేంద్రం వేతనాలకు సంబంధించి మొత్తం నిధులు, మెటీరియల్‌, నిర్వహణ వ్యయంలో 75శాతం నిధులు అందించేది. వీబీజీరామ్‌జీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం వ్యయాలను భరిస్తాయి. ఉపాధి పథకం వల్ల వ్యవసాయ సీజన్‌లో శ్రామికులు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలున్న నేపథ్యంలో తాజాచట్టంలో 60 రోజుల ఉపాధి విరామాన్ని ప్రకటించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించారు. అంటే ఏడాదిలో పది నెలలు మాత్రమే ఉపాధి పనులు జరిగే అవకాశముంది. అలాగే, వారానికోసారి వేతనాలు అందించనున్నారు. మస్టర్‌ వేసిన 15 రోజుల్లోపు వేతనాలు కచ్చితంగా శ్రామికుని ఖాతాలో జమచేస్తారు. ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తారు. పనికావాలని దరఖాస్తు చేసుకున్న శ్రామికుడికి 15రోజుల్లోపు పని కల్పించాలని, లేకపోతే ఆ శ్రామికుడికి నిరుద్యోగభృతి కల్పించాలని చట్టంలో పేర్కొన్నారు. పని కావాలని పంచాయతీ కార్యాలయంలో ప్రతి శ్రామికుడు చేసే దరఖాస్తును కచ్చితంగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ద్వారా గానీ, వాట్సాప్‌ ద్వారా కూడా రిజిస్టర్‌ చేసుకునే అవకాశం కల్పించారు. వీబీజీరామ్‌జీ అమలుకు గ్రామ పంచాయతీలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. వార్షిక ప్రణాళికలు నార్మేటివ్‌ కేటాయింపులకు తగినట్లుగా రూపొందిస్తారు. వికసిత్‌ గ్రామ పంచాయతీల ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక పథకాలను అనుసంధానిస్తారు. గ్రామ పంచాయతీలే గ్రామ స్థాయిలో ప్రణాళికలు తయారుచేసి ఈ పథకాన్ని అమలు చేయాలి. పనులకొచ్చే కుటుంబాలను రిజిస్టర్‌ చేసి గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డులను పంచాయతీలే మంజూరుచేస్తాయి.


సీఎం చైర్మన్‌గా గ్యారెంటీ కౌన్సిల్‌...

ఏపీ రాష్ట్ర గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీ కౌన్సిల్‌కు సీఎం చైర్మన్‌గా, ఉపముఖ్యమంత్రి వైస్‌చైర్మన్‌గా, ఆర్థిక, రెవెన్యూ, అటవీ, జలవనరులు, వ్యవసాయ, గిరిజన, సాంఘిక సంక్షేమ, కార్మిక, ఉపాధి, మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రులు, సీఎస్‌, ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు, వీబీజీరామ్‌జీ డైరెక్టర్‌ సభ్యులుగాను, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ మెంబర్‌ సెక్రటరీగాను వ్యవహరిస్తారు. వీరితో పాటు మరో 15 మంది అనధికార సభ్యులను పంచాయతీరాజ్‌ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది.

వారికి ప్రత్యేక కార్డు..

వీబీజీరామ్‌జీలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్ల పైబడినవారు, వెట్టి కార్మికులు, పీవీటీజీలు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డు అందిస్తారు. ప్రతి ఆరు నెలలకు కనీసం ఒకసారి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. పనులు, వేతనాలు, మస్టర్‌రోల్స్‌, చెల్లింపుల వివరాలను ప్రజలకు బహిరంగంగా వెల్లడించడం తప్పనిసరి. ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ రీడ్రెసల్‌ వ్యవస్థ, అంబుడ్స్‌పర్సన్‌ వ్యవస్థ అమల్లో ఉంటుంది. పర్యవేక్షణ, తనిఖీలు, మూల్యాంకనం, జరిమానాలు, నష్టపరిహారం వసూలు, శిక్షణకు సంబంధించిన నిబంధనలు కూడా ఈ పథకంలో ఉన్నాయి.

Updated Date - Jun 06 , 2026 | 05:06 AM