విజయ్‌పాల్‌పై ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:12 AM
శాసనసభ ఉపసభాపతి, నాటి నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు, రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్ శనివారం దర్యాప్తు అధికారి దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ
చాలా ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు
సునీల్ నాయక్, బోరుగడ్డ అనీల్ గైర్హాజరు
విజయనగరం క్రైం/గుంటూరు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): శాసనసభ ఉపసభాపతి, నాటి నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు, రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్ శనివారం దర్యాప్తు అధికారి దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన్ను మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విచారించారు. రఘురామపై దేశద్రోహానికి సంబంధించి నాటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. రచ్చబండ పేరుతో నాటి సీఎం జగన్‌ను రఘురామ విమర్శించిన 45 వీడియోలను కూడా పెన్‌డ్రైవ్‌లో విజయ్‌పాల్‌కు అందించారు. ఉదయం 9:30కు ఫిర్యాదు వస్తే అప్పటికప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే కాకుండా ఆ వీడియోలన్నీ పరిశీలించి పది పేజీల స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడం, గంట వ్యవధిలోనే 20మంది సీఐడీ బృందంతో హైదరాబాద్ వెళ్లడం ఎలా సాధ్యమైందంటూ దర్యాప్తు అధికారి ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పటికప్పుడు ఆ స్టేట్‌మెంట్‌ను ఎవరు తయారు చేశారని ప్రశ్నిస్తే తనకు దీనిపై అనుభవం ఉందని, తానే సిద్ధం చేశానని విజయ్‌పాల్ చెప్పినట్లు సమాచారం. ఫిర్యాది అందించిన వీడియోలు నిజమైనవేనా..? లేదా నకిలీవా అని ఎలా నిర్ధారించారు? వాటిని ఎఫ్‌ఎ్‌సఎల్‌కు ఎందుకు పంపలేదన్న ప్రశ్నకు.. ఆయా వీడియోలను తాను ముందే చూశానని అవన్నీ ఒరిజినల్‌గానే భావించి ల్యాబ్‌కు పంపలేదని బదులిచ్చినట్లు తెలిసింది.
2021 మే 14న రంజాన్ సందర్భంగా సెలవు దినమైతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అరగంటలోనే 20మందిని ఎలా సిద్ధం చేయగలిగారని ఐవో ప్రశ్నించగా.. ఆ రోజు అంతా అందుబాటులో ఉన్నారని, రమ్మని మెసేజ్ పెట్టగానే వచ్చేశారని చెప్పినట్లు సమాచారం. ఈ మొత్తం ప్రక్రియ గంట వ్యవధిలో ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. రఘురామను అరెస్టు చేసి తీసుకురమ్మని సునీల్ ఆదేశించారని చెప్పినట్లు సమాచారం. విచారణలో భాగంగా పలు ప్రశ్నలకు విజయ్‌పాల్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ఈ కేసుకు రౌడీషీటర్ బోరుగడ్డ అనీల్‌కు సంబంధం ఏమిటి..? అతను రౌడీషీటర్ అని తెలిసి కూడా సాక్షిగా ఎలా ఎంచుకున్నారని ప్రశ్నిస్త.. ఆయనే వచ్చి తాను సాక్షిగా ఉంటానన్నారని చెప్పినట్లు సమాచారం. రఘురామపై దేశద్రోహం కేసు నమోదు చేస్తున్నట్లు ఆయనకు ఎలా తెలుసన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. ఆదివారం కూడా విచారణకు హాజరుకావాలని విజయ్‌పాల్‌ను దర్యాప్తు అధికారి ఆదేశించినట్లు తెలిసిం ది. కాగా, విజయ్‌పాల్‌తో పాటు మరో నిందితుడు, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్, బోరుగడ్డ అనీల్‌ను కూడా విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి నోటీసులు ఇచ్చారు. అయితే శనివారం అత్యవసర పని ఉన్నందున రాలేకపోతున్నానని ఆదివారం హాజరవుతానని సునీల్ సమాచారం పంపారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు విజయనగరం రాలేనని, బోరుగడ్డ చెప్పినట్లు తెలిసింది. అయితే ఒకటి రెండు రోజులు సమయం తీసుకుని అయినా సరే రావాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఆదివారం సునీల్ నాయక్, విజయ్‌పాల్‌ను కలిపి విచారించనున్నారని తెలిసింది.