బెజవాడ యువతి అమెరికాలో హత్య
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:14 AM
అమెరికాలో దాదాపు ఎనిమిది నెలల కిందట అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విజయవాడకు చెందిన రజిత సబ్బినేనిని భర్తే హత్య చేసినట్టు తేలింది.
8 నెలల క్రితం రజిత మృతి.. తాజాగా హత్యగా తేల్చిన పోలీసులు
పక్కా ప్లాన్‌తో చంపిన భర్త అవినాశ్.. హత్యకు ముందు గూగుల్‌లో శోధన
గొంతు నులిమి చంపినట్టు పోస్టుమార్టం నివేదిక.. మరో మహిళతో
వివాహేతర సంబంధమే కారణం.. భార్య మృతదేహం ఫొటో ప్రియురాలికి..
విజయవాడ/ఎన్టీఆర్ సర్కిల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో దాదాపు ఎనిమిది నెలల కిందట అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విజయవాడకు చెందిన రజిత సబ్బినేనిని భర్తే హత్య చేసినట్టు తేలింది. భర్త అవినాశ్ నార్నే పెళ్లయిన నాలుగు నెలలకే ఆమెను దారుణంగా చంపినట్టు తాజాగా అమెరికా పోలీసుల విచారణలో నిర్ధారణైంది. రజితకు శ్వాస ఆడకుండా అతడు గొంతు నులిమినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. రజిత మరణంపై అప్పట్లో కట్టుకథలు అల్లిన అవినాశ్ చివరకు దోషిగా తేలాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాలు తెలియడంతో విజయవాడ గాయత్రీనగర్‌లో ఉంటున్న రజిత తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. రజితతో అవినాశ్‌కు 2025 జూన్ 5న వివాహం జరిగింది. ఆ తర్వాత జూలైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్‌వ్యూ నగరానికి వెళ్లారు. అమెరికా వెళ్లిన కొద్దిరోజులకే గతేడాది అక్టోబరు 27న రజిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. హత్య జరిగిన రోజు రాత్రి నిందితుడు అవినాశ్ పోలీసులకు ఫోన్ చేసి, తన భార్య బాత్‌రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా పలకడం లేదని పెద్ద డ్రామా ఆడాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టగా రజిత అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. దీనిని ఆత్మహత్య లేదా సహజ మరణంగా చిత్రించేందుకు అవినాశ్ తీవ్రంగా ప్రయత్నించాడు. అమెరికా డిటెక్టివ్‌ల ఎనిమిది నెలల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా పోలీసుల విచారణలో నిందితుడి క్రూరత్వం ఒక్కొక్కటిగా బయటపడింది. అవినాశ్‌కు భారతదేశంలో ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఆ కారణంగానే భార్యను వదిలించుకోవాలని పక్కా స్కెచ్ వేశాడని తేలింది.
రజిత చనిపోయిన వెంటనే ఆమె మృతదేహం ఫొటోను తన ప్రియురాలికి అవినాశ్ పంపినట్లు డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు అవినాశ్ తన ఫోన్, ల్యాప్‌టాప్‌లలో ‘మానవ శరీరంలోకి విష పదార్థాలు ఎలా వెళ్తాయి’, ‘పోస్ట్‌మార్టంలో విషాన్ని ఎలా గుర్తిస్తారు’, ‘మెడ నులిమినప్పుడు ఎంత సమయంలో ప్రాణం పోతుంది’ వంటి విషయాల గురించి గూగుల్‌లో వెతికినట్లు ఆధారాలు లభించాయి. మరోవైపు చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నుంచే రజిత.. తన భర్త ఇస్తున్న జ్యూసులు చాలా చేదుగా ఉంటున్నాయని, చనిపోయిన రోజు కూడా అతను ఇచ్చిన స్మూతీ మందులా ఘాటుగా ఉందంటూ భర్తకే వాట్సాప్ మెసేజ్‌లు చేసింది. మొదట ఆమెకు ఏదైనా మత్తుమందు లేదా విషం ఇచ్చి స్పృహ తప్పాక గొంతు నులిమి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇంటి డిజిటల్ స్మార్ట్‌లాక్ డేటాను పరిశీలించగా ఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ రాలేదని, అవినాశ్ మాత్రమే ఉన్నాడని స్పష్టమైంది. బెల్‌వ్యూ పోలీసులు అవినాశ్‌ను ఫస్ట్ డిగ్రీ మర్డర్ (ముందస్తు ప్రణాళికతో చేసిన అత్యంత తీవ్రమైన హత్య) కింద అరెస్ట్ చేసి కింగ్ కౌంటీ జైలుకు తరలించారు. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉండటంతో కోర్టు 5 మిలియన్ డాలర్ల భారీ బెయిల్ మొత్తాన్ని విధించింది. అంత పెద్ద మొత్తం చెల్లించలేక అవినాశ్ జైల్లోనే ఉన్నాడు. వాట్సాప్ మెసేజ్‌లు, గూగుల్ సెర్చ్ హిస్టరీ, స్మార్ట్‌లాక్ డేటా వంటి బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో నిందితుడికి అమెరికా కోర్టులో జీవిత ఖైదు లేదా గరిష్ఠ స్థాయి కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.