టాప్‌లో విజయవాడ పశ్చిమ
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:19 AM
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వివిధ రంగాల్లో అద్భుత పనితీరు కనబర్చి నూటికి 93 మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ సాధించింది.
హిందూపురం-5, పిఠాపురం-10
టాప్-13లోనూ లేని కుప్పం, మంగళగిరి
చిట్టచివరి స్థానంలో గుంటూరు పశ్చిమ
ప్రగతి నివేదిక విడుదల చేసిన చంద్రబాబు
నియోజవర్గాల్లోని స్థితిగతులపై ర్యాంకింగ్స్
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వివిధ రంగాల్లో అద్భుత పనితీరు కనబర్చి నూటికి 93 మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ సాధించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. హిందూపురం 5వ స్థానంలో, పిఠాపురం 10వ స్థానంలో నిలవగా, కుప్పం, మంగళగిరికి తొలి-13 స్థానాల్లో చోటు దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లోని స్థితిగతులపై నివేదిక ఆధారంగా ప్రభుత్వం ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఎమ్మెల్యేలకు వచ్చిన ర్యాంకులుగా వీటిని చూడరాదని స్పష్టం చేసింది. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉన్న వనరుల ఆధారంగా 141 నుంచి 69 సూచికలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నివేదికను విడుదల చేశారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఈ ప్రగతి నివేదికపై సీఎం చర్చించారు.
ఏ ప్లస్ నియోజకవర్గాలు.. 21
మొత్తం 175 నియోజకవర్గాలకు 2026 జనవరి వరకు ఉన్న డేటా ఆధారంగా ర్యాంకింగ్‌లు ఇచ్చారు. నూటికి 90 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధిస్తే ఎక్సలెంట్ అని ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారు. 75 నుంచి 89 శాతం మార్కులు సాధిస్తే గుడ్ అని ఏ గ్రేడ్, 50 నుంచి 74 శాతం సాధిస్తే మోడరేట్ అని బీ గ్రేడ్, 50 శాతం కన్నా తక్కువ సాధిస్తే పూర్ అని పేర్కొంటూ సీ గ్రేడ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్లస్ సాధించిన నియోజకవర్గాలు 21, ఏ గ్రేడ్ సాధించినవి 153 ఉన్నాయి. బీ గ్రేడ్ సాధించిన నియోజకవర్గం ఒకే ఒక్కటి ఉండగా, సీ గ్రేడ్ సాధించిన నియోజకవర్గాలు ఏవీ లేకపోవడం గమనార్హం. విజయవాడ పశ్చిమ 93 మార్కులతో ఏప్లస్ గ్రేడ్ సాధించగా, తర్వాతి స్థానాల్లో వరుసగా గాజువాక (92 మార్కులు), కాకినాడ సిటీ (92 మార్కులు), విజయవాడ తూర్పు, హిందూపురం, పెనుకొండ, కదిరి, విశాఖపట్నం పశ్చిమ, మాడుగుల, పిఠాపురం, రామచంద్రాపురం, జగ్గంపేట, గోపాలపురం(ఎస్సీ) అన్నీ 91 మార్కులు సాధించి ఏ ప్లస్‌లో నిలిచాయి. కొండెపి (ఎస్సీ) 79 మార్కులు, కందుకూరు 78 మార్కులు, కావలి 78 మార్కులు, ఒంగోలు 77 మార్కులతో ఏ గ్రేడ్ సాధించాయి. జాబితాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 73 మార్కులతో బీ గ్రేడ్‌తో చిట్టచివరి స్థానంలో నిలిచింది.
జిల్లాల వారీగా ప్రగతి ఇలా..
వ్యవసాయ-అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాలతో పాటు వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో జిల్లాలు సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు, గ్రేడ్‌లు కేటాయించారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కాకినాడ 94 మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో శ్రీసత్యసాయి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు నిలిచాయి. ఈ రంగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 69 మార్కులతో బీ గ్రేడ్‌తో అట్టడుగున నిలిచింది.
పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం 99 మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో అన్నమయ్య, పార్వతీపురం మన్యం నిలవగా, చిట్టచివరి స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా 38 మార్కులతో సీ గ్రేడ్ సాధించింది. ఏలూరు జిల్లా కూడా 48 మార్కులతో సీ గ్రేడ్‌తో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
సేవా రంగంలో గుంటూరు జిల్లా 97 మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం, బాపట్ల 96, 95 మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ సాధించాయి. చివరి స్థానంలో చిత్తూరు జిల్లా 75 మార్కులతో ఏ గ్రేడ్ సాధించింది.
ఎస్డీజీ (సస్టెయినబుల్ డెవల్‌పమెంట్ గోల్), ఆరోగ్య రంగాల్లో పల్నాడు, తిరుపతి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. చివరి రెండు స్థానాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలు నిలిచాయి.
ఈ ఏడాది 9.88 శాతం వృద్ధి అంచనా
2024-25లో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 9.03 శాతం వృద్ధి సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.14 శాతం వృద్ధి అంచనా వేస్తున్నారు.
పారిశ్రామిక రంగంలో గత ఆర్థిక సంవత్సరంలో 8.05 శాతం వృద్ధి సాధించగా, ఈ ఏడాది 9.15 శాతం వృద్ధి అంచనా వేస్తున్నారు.
సేవా రంగంలో గత ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం వృద్ధి నమోదు కాగా, ఈ ఏడాది 10.67 శాతం వృద్ధిరేటు అంచనా వేస్తున్నారు.
స్థూల విలువ జోడింపు గత ఏడాది 8.6 శాతం పెరగ్గా, ఈ ఏడాది 10.07 శాతం వృద్ధిరేటు అంచనా వేస్తున్నారు.
జీఎస్‌డీపీ 8.27 శాతం నమోదు కాగా, ఈ ఏడాది 9.88 శాతం అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ జీడీపీ 6.51 శాతం నమోదు కాగా, ఈ ఏడాది 7.4 శాతం అంచనా వేస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో తలసరి ఆదాయం 7.91 శాతం పెరిగి రూ.1,41,847 ఉండగా, ఈ ఏడాది 9.56 శాతం పెరిగి రూ.1,55,412కు చేరుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో జాతీయ తలసరి ఆదాయ సగటు గత ఏడాది రూ.1,14,710 ఉండగా,ఈఏడాది రూ.1,21, 968 ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రెవెన్యూ లోటులో 30వ ర్యాంకు
రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోందని, ఇతర అవసరాలకు అప్పులు చేస్తున్నామని, అందుకే రెవెన్యూ లోటులో రాష్ట్రం అత్యంత వెనుకబాటులో ఉందని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రానికి అప్పులు చేయడంలో 28వ ర్యాంకు, కేంద్ర రుణాల్లో 25వ ర్యాంకు వచ్చాయి. జీఎ్‌సడీపీలో అప్పుల నిష్పత్తి సూచీలో 19వ ర్యాంకు, స్థూల ద్రవ్యలోటు సూచీలో 26వ ర్యాంకులో నిలిచింది. రెవెన్యూ ఆదాయంలో 12వ ర్యాంకు, మూలధన వ్యయంలో 12వ ర్యాంకు, సొంత పన్ను ఆదాయం, జీఎ్‌సడీపీ,వడ్డీ చెల్లింపుల్లో 8వ ర్యాంకులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.60,480 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం 90 శాతం ఉండగా, తెలంగాణ ఈ ఖర్చును 75 శాతానికే పరిమితం చేసింది. అలాగే మొత్తం వ్యయంలో మూలధన వ్యయం ఏపీలో 10 శాతం మాత్రమే ఉండగా, తెలంగాణలో 24 శాతం ఉంది.