కంటైనర్, ట్యాంకర్ మధ్య నలిగిన కారు
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:52 AM
వేగంగా వెళ్తున్న ఓ కంటెయినర్ లారీ టైరు పంక్చరై మరో లారీని.. పక్కనే ఓవర్ టేక్ చేస్తున్న కారును ఢీకొన్న ప్రమాదంలో తల్లీకొడుకుతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.
ముగ్గురు దుర్మరణం, ఇద్దరికి తీవ్ర గాయాలు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
మృతుల్లో తల్లీకొడుకు, ద్విచక్రవాహనదారుడు
కంటైనర్ లారీ టైరు పంక్చరవడంతో ఘటన
గన్నవరం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): వేగంగా వెళ్తున్న ఓ కంటెయినర్ లారీ టైరు పంక్చరై మరో లారీని.. పక్కనే ఓవర్ టేక్ చేస్తున్న కారును ఢీకొన్న ప్రమాదంలో తల్లీకొడుకుతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా చిన అవుటపల్లి-కాజా వెస్ట్ బైపా్‌సపై మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ నుంచి ఏలూరు వైపు కంటైనర్ లారీ వెళ్తోంది. గన్నవరం మండలం బీబీగూడెం వద్ద వెస్ట్ బైపా్‌సలో కంటైనర్ లారీ టైర్ పంక్చర్ అవడంతో ఎదురుగా ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టి.. పక్క నుంచి ఓవర్‌టేక్ చేయబోయిన ఇన్నోవా కారును ఢీ కొంది. దీంతో ఆ కారు ట్యాంకర్ లారీ కిందికి దూసుకుపోయింది. రెండు భారీ వాహనాల మధ్య కారు నుజ్జునుజ్జయిన సమయంలో.. వెనుకనే వస్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని కూడా లారీ ఢీకొనడంతో వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కైకలూరు మండలం పెంచికలమర్రు గ్రామానికి చెందిన జయమంగళ బాల వెంకట నాగదుర్గ(28) ఆమె కుమారుడు కారుణ్య నాగసాయి(3)తోపాటు, విజయవాడకు చెందిన ద్విచక్రవాహనదారుడు దాసరి వెంకటేశ్వరరావు(45) అక్కడికక్కడే మృతి చెందారు. జయమంగళ వెంకట విజయకుమార్‌తో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.