Share News

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:12 AM

‘ఉగ్ర సంస్థలు, వాటి సాహిత్యం గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. జిహాదీ విధివిధానాలను అకళింపు చేసుకుంటున్నాం. మేం ఇంకా చాటింగ్‌ దశలోనే ఉన్నాం...’

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

  • ఇంకా చాటింగ్‌ దశలోనే ఉన్నాం.. వెల్లడించిన ఉగ్ర సానుభూతిపరులు

విజయవాడ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘ఉగ్ర సంస్థలు, వాటి సాహిత్యం గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. జిహాదీ విధివిధానాలను అకళింపు చేసుకుంటున్నాం. మేం ఇంకా చాటింగ్‌ దశలోనే ఉన్నాం...’ ఇవీ, ఉగ్రవాద సంస్థలకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న నిందితులు పోలీసు కస్టడీలో చెప్పిన జవాబులు. విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్‌, డానిష్‌, సొహైల్‌ బేగ్‌, సయిదా బేగం(హైదరాబాద్‌), అబ్దుల్‌ సలాం(బళ్లారి)లను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణ ఆదివారంతో ముగుస్తుంది. వీరంతా ‘బెనెక్స్‌ కామ్‌’ అనే గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఉగ్ర సంస్థలకు చెందిన నేతల ప్రసంగాల వీడియోలు, వాటికి సంబంధించిన సాహిత్యాన్ని పోస్ట్‌ చేస్తూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్రూపులో మొత్తం ఏడు రాష్ట్రాలకు చెందిన యువకులు ఉండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఏడాదిగా ఈ గ్రూపు నడుస్తున్నట్టు నిర్ధారించారు. నిందితులను విచారించడానికి విశాఖ, హైదరాబాద్‌ నుంచి ఎన్‌ఐఏ, తెలంగాణ, కర్ణాటక సీఐ సెల్‌, బిహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర ఏటీఎస్‌ బృందాలు, రాజస్థాన్‌ నిఘా వర్గాలు విజయవాడకు చేరుకున్నాయి. ‘అల్‌ హకీమ్‌ షుకూర్‌’ ఎవరన్న విషయాన్ని రాబట్టడంపై ఈ బృందాలు దృష్టి సారించాయి. షుకూర్‌, బెనెక్స్‌లో చాటింగ్‌ మాత్రమే చేసేవాడని, అతనితో ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడలేని నిందితులు చెప్పినట్టు తెలిసింది. ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసిన విజయవాడకు చెందిన సొహైల్‌ బేగ్‌... విచారణలో తాను జిహాదీకి అనుకూలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడని విశ్వసనీయ సమాచారం. జిహాదీలో నియామకాల విధివిధానాల గురించి తెలియజేయాలంటూ బెనెక్స్‌ గ్రూపులో అతను చేసిన పోస్టును నిఘా వర్గాలు గుర్తించాయి. సొహైల్‌ను పోలీసులు ఎక్కువ సమయం ప్రశ్నించారు. వీరి కస్టడీ ముగిసిన తరువాత... ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న మిగిలిన ఏడుగురినీ కస్టడీలోకి తీసుకోవాలని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Apr 05 , 2026 | 04:13 AM