Share News

లయకారుడి సొమ్మూ లాగేశారు

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:11 AM

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెతను నిజం చేసిన ఉదంతం ఇది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు కొండపై శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సంగా నరసింహరావు అనే దాత అభివృద్ధి చేశారు.

లయకారుడి సొమ్మూ లాగేశారు

  • విజయవాడలోని యనమలకుదురు ఆలయ కానుకల్లో చేతివాటం

  • ఆలయంలోని సీసీ కెమెరాలను ఆపేసి, మారుతాళాలతో హండీలను తెరిచిన వైనం

  • కట్టకు 100 బదులు 200 నోట్లు కట్టి మోసం.. రెండేళ్లుగా వ్యవహారం.. ఈవోయే ఇంటి దొంగ

  • ఇప్పటికే ప్రధానార్చకుడు సహా ముగ్గురి అరెస్టు.. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఈవో భవానీ

త్రినేత్రుడు మూడో నేత్రాన్ని మూసే ఉంచుతాడు. ఆ కన్ను తెరిస్తే ప్రళయమేనని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆయన ఆలయాలను పర్యవేక్షించాల్సిన మూడో నేత్రం మూసుకుపోతే ఏం అవుతుంది? అరాచకానికి అలారం మోగుతుంది. హుండీ కానుకలకు కాళ్లు వస్తాయి. నోట్ల కట్టలు మాయమవుతాయి. విజయవాడ శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సరిగ్గా ఇదే జరిగింది.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెతను నిజం చేసిన ఉదంతం ఇది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు కొండపై శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సంగా నరసింహరావు అనే దాత అభివృద్ధి చేశారు. ఆదాయం పెరుగుతుండడంతో దేవదాయ శాఖ కొన్నాళ్ల క్రితం తన పరిధిలోకి తీసుకుంది. అప్పటి నుంచి దేవదాయ శాఖ ఇక్కడ ఈవోలను నియమిస్తోంది. ఈ ఆలయానికి ప్రస్తుతం నరసింహరావు చైర్మన్‌గా, ఈవోగా భవానీ కొనసాగుతున్నారు. ప్రధానాలయంతో పాటు ఇతర ఉపాలయాల వద్ద ఉన్న హుండీల తాళాలు దేవదాయ శాఖ కృష్ణా జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) వద్ద ఉంటాయి. హుండీలు లెక్కించే సమయానికి ఆ తాళాలను తీసుకొస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత తిరిగి తాళాలను ఏసీకి అప్పగించాలి. ఆలయంలో పనిచేసే ఉద్యోగులను ఏసీ వద్దకు పంపి ఈవో భవానీ తాళాలు తెప్పించేవారు. హుండీపై కన్నేసిన భవానీ.. ఆలయ ప్రధానార్చకుడు సాగర్‌, ఆయన సహాయకుడు పూర్ణ, తాత్కాలిక ఉద్యోగి రోశయ్యతో కలిసి పక్కా ప్లాన్‌ రూపొందించారు.


ఇలా దోచేశారు..

పోలీసులకు ఆలయ చైర్మన్‌ నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి, ఆలయంలో లెక్కింపు సమయంలో ఏసీ ఆఫీ్‌సనుంచి తాళాలు తీసుకొచ్చినప్పుడు సాగర్‌, పూర్ణ వాటికి మారు తాళాలను తయారు చేయించారు. హుండీలు తెరిచిన తర్వాత అందులో ఉన్న డబ్బులు, కానుకలను పళ్లాల్లో తీసుకుని ఆలయ ముఖ మంటపం వద్దకు తీసుకొచ్చి లెక్కించడం ఆనవాయితీ. ప్రతి ఏడాదీ మూడుసార్లు హుండీలను లెక్కిస్తారు. కొండకు దిగువన సాగర్‌ నివాసం ఉంటున్నాడు. ఆలయ తాళాలు ఆయన వద్దే ఉంటాయి. అందరూ కలిసి ఆలయ మంటపాలు, చుట్టూ ఉన్న 16 సీసీ కెమెరాలను ఆఫ్‌చేసి మారుతాళాలతో కానుకలను మాయం చేసేవారు. ఇదంతా ఈవో భవానీ కనుసన్నల్లో సాగేది. దినసరి వేతనంపై పనిచేసే రోశయ్య వీరికి సహకరించారు.

ఈవో రూటే సపరేటు..

హుండీ చోరీలో ఈవో భవానీది మరో దారి. ఆలయ లెక్కల ప్రకారం కట్టకు 100నోట్లు ఉండాలి. ఈవో మాత్రం కట్టకు 200 నోట్లు పెట్టించినట్టు తేలింది. హుండీల్లోని నగదును బ్యాంక్‌లో జమ చేస్తారు. ఆ సమయంలో నోట్ల కట్టల్లో అదనంగా పెట్టించిన 100 నోట్లను పక్కకు తీసి జమ చేసేవారు. రెండేళ్లలో ఇలా రూ.10 లక్షల విలువైన కానుకలను మాయం చేసినట్టు నరసింహారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హుండీల్లో భక్తులు వేసిన నోట్లలో కొన్నింటిపై మరకలు ఉంటాయి. కొన్ని నోట్లు చిరిగి ఉంటాయి. వాటిని శాయిల్డ్‌ నోట్స్‌గా వ్యవహరిస్తారు. వాటిని ఒక గోనె సంచిలో పెట్టుకుని రఘుపతి అనే గుమస్తా ఇంటికి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.


ఇలా వెలుగులోకి...

ఈనెల ఐదో తేదీన సాగర్‌, పూర్ణ, రోశయ్య మద్యం దుకాణం వద్ద ఏదో విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో వారి నోటినుంచి హుండీ చోరీ గుట్టు బయటకు వచ్చింది. అక్కడే ఉన్న నరసింహారావు డ్రైవర్‌ అదంతా విని తన ఓనరుకు తెలిపారు. పోలీసులు రోశయ్యను విచారించగా, అతను నేరం అంగీకరించాడు. అతనితోపాటు పూర్ణ, రోశయ్యను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదైన విషయం తెలిసిన వెంటనే..ఈవో భవానీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కాగా, భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఈవోగా గతంలోనూ పనిచేశారు. ఐదేళ్లపాటు ఇక్కడే ఈవోగా పనిచేసి విజయవాడ మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయానికి బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఈ ఆలయానికి వచ్చారు.

Updated Date - Mar 21 , 2026 | 04:12 AM