Share News

బెజవాడలో బాహాబాహీ!

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:22 AM

టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలతో విజయవాడ, అనంతపురం జిల్లా యాడికిల్లో ఉద్రిక్తత నెలకొంది.

బెజవాడలో బాహాబాహీ!

  • గవర్నమెంట్‌ ప్రెస్‌ వద్ద వైసీపీ నాయకుల దీక్ష

  • వైసీపీ ఫ్లెక్సీలు, టెంట్‌ కూల్చివేసిన టీడీపీ శ్రేణులు

  • ఇరు వర్గాల మధ్య తోపులాట

  • యాడికిలో ఇరు పార్టీల పోటాపోటీ నిరసనలు

విజయవాడ/యాడికి/తాడిపత్రి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలతో విజయవాడ, అనంతపురం జిల్లా యాడికిల్లో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో విజయవాడలోని గవర్నమెంట్‌ ప్రెస్‌ వద్ద దీక్షకు సిద్ధమయ్యారు. ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రాంతంలో నిరసనలకు ఎలా అనుమతులు ఇస్తారని స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పోలీసులను ప్రశ్నించారు. గంటన్నర గడిచినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బొండా ఉమా టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా గవర్నమెంట్‌ ప్రెస్‌ వద్దకు వచ్చారు. వైసీపీ టెంట్లను టీడీపీ కార్యకర్తలు కూల్చేశారు. ఫ్లెక్సీలను చించివేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వీరి దీక్షా శిబిరం వద్ద టీడీపీ శ్రేణులు పోటీగా ఆందోళనలుచేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు. కోడిగుడ్లు, టమాటాలు విసురుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. తర్వాత మిగిలిన వారిని కూడా వ్యాన్‌లో ఎక్కించి ధర్నా చౌక్‌కు తరలించారు.


యాడికిలో హైటెన్షన్‌

అనంతపురం జిల్లా యాడికిలోని టీడీపీ కార్యాలయం వద్ద గురువారం వైసీపీ నాయకులు బైఠాయించారు. దీనికి టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. వారికి పోటీగా టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు పక్షాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు వైసీపీ శ్రేణులు నిరసన దీక్ష విరమించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వైసీపీ, టీడీపీ నాయకులు నిరసనలకు దిగడంతో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. కాగా, వైసీపీ నిరసనకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరుకానున్నారనే సమాచారంతో తాడిపత్రిలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా వెళ్లడానికి వీలులేదన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 05:23 AM