సబార్డినేట్ ఆస్తులు రూ.రెండు కోట్లు పైనే!
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:45 AM
వాణిజ్య పన్నుల శాఖలో సబార్డినేట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆస్తి రూ.రెండు కోట్లకు పైగా ఉండటం అధికారులను అవాక్కయ్యేలా చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు
విజయవాడ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల శాఖలో సబార్డినేట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆస్తి రూ.రెండు కోట్లకు పైగా ఉండటం అధికారులను అవాక్కయ్యేలా చేసింది. విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ సబార్డినేట్ కొండపల్లి శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని అందిన ఫిర్యాదుల మేరకు అతని ఇల్లు, ఆయన సోదరుల ఇళ్లలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. గవర్నరుపేట సర్కిల్ కార్యాలయంలో శ్రీనివాసరావు సబార్డినేట్‌గా పనిచేసేవారు. 2022 ఆగస్టులో వన్‌టౌన్‌లో ఓ పార్శిల్ కార్యాలయ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, ఇప్పటికీ అతను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు వన్‌టౌన్‌లో శ్రీనివాసరావు ఇల్లు, ఆయన సోదరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అతని పేరిట ఖరీదైన భవనం, ఖాళీ స్థలం ఉన్నట్టు గుర్తించారు. 760 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు బంగారం బిస్కెట్లను అధికారులు సీజ్ చేశారు. 7.8 కిలోల వెండి ఆభరణాలు, బ్యాంక్ ఖాతాలో రూ.22 లక్షలు నగదు ఉన్నట్టు గుర్తించారు. శ్రీనివాసరావు అతని కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద సుమారు రూ.రెండు కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు.