Share News

వరి కల్లంలో విద్యార్థులతో చాకిరీ!

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:53 AM

యూనిఫాంతో ఉన్న విద్యార్థులు ఎక్కడ ఉండాలి? ఉంటే పాఠశాలలో.. లేదా బడి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లాలి. అయితే పలువురు విద్యార్థులు మండుటెండలో స్కూల్‌ డ్రెస్‌లోనే వరి కల్లంలో పనిచేస్తూ కనిపించారు..

వరి కల్లంలో విద్యార్థులతో చాకిరీ!

  • బడి అయిపోయిన తర్వాత వారిని కారులో తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు

  • మండుటెండలో వడ్లు ఆరబెట్టే పని

విజయవాడ/జగ్గయ్యపేట రూరల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): యూనిఫాంతో ఉన్న విద్యార్థులు ఎక్కడ ఉండాలి? ఉంటే పాఠశాలలో.. లేదా బడి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లాలి. అయితే పలువురు విద్యార్థులు మండుటెండలో స్కూల్‌ డ్రెస్‌లోనే వరి కల్లంలో పనిచేస్తూ కనిపించారు.. వారిని బలవంతంగా తీసుకెళ్లి పని చేయించుకున్నారు! ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం ఇదీ. పిల్లలు పొలంలో చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మార్ఠడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. గండ్రాయి గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో వెంకటేశ్వర్లు హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఒంటిపూట బడుల కారణంగా సోమవారం మధ్యాహ్న భోజనం అనంతరం పాఠశాల మూసేశారు. అనంతరం ఆ ఉపాధ్యాయుడు కొంత మంది విద్యార్థులను కారులో ఎక్కించుకుని.. సుమారు 15 కిమీ దూరంలోని తన స్వగ్రామమైన తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు తీసుకెళ్లారు. అక్కడ తన వరి కల్లాల్లో ఉన్న వడ్లను విద్యార్థులతో ఆరబెట్టించారు. దీన్ని గమనించిన స్థానికులు ఫోటోలు తీసి, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటోల్లో విద్యార్థులు స్కూల్‌ యూనిఫాంలోనే ఉండటం గమనార్హం. కారు నెంబర్‌ ఆధారంగా ఉపాధ్యాయుడిని గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎంఈవో చిట్టిబాబును వివరణ కోరగా.. సోషల్‌ మీడియాలో వచ్చిన ఫోటోలు తమ దృష్టికి వచ్చాయని, పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం సైదులు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత విద్యార్థులను విడిచిపెట్టినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుడితో వెళ్లిన విషయం తనకు తెలియదని, సోషల్‌ మీడియా ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 06:55 AM