Share News

మర్మావయవంలో కాగితాలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:19 AM

రోజూ పాఠశాలకు వెళ్లొస్తున్న బాలిక వద్ద ఒక్కసారిగా దుర్వాసన రావడంతో తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా, మర్మావయవంలో న్యూస్‌ పేపర్ల ముక్కలు కనిపించాయి.

మర్మావయవంలో కాగితాలు

  • ఆటిజం బాలికపై స్కూల్‌ కరస్పాండెంట్‌ దురాగతం?.. కేసు నమోదు

విజయవాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రోజూ పాఠశాలకు వెళ్లొస్తున్న బాలిక వద్ద ఒక్కసారిగా దుర్వాసన రావడంతో తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా, మర్మావయవంలో న్యూస్‌ పేపర్ల ముక్కలు కనిపించాయి. ఈ ఘటన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గొల్లపూడిలో నాలుగు రోజుల క్రితం జరిగింది. గొల్లపూడికి చెందిన 17 ఏళ్ల బాలిక సమీపంలోని ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమెకు ఆటిజం ఉంది. నాలుగు రోజుల క్రితం ఆమె వద్ద దుర్వాసన విపరీతంగా వచ్చింది. దీంతో తల్లిదండ్రులు కుమార్తెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలికను వైద్యులు పరీక్షించగా, ప్రైవేట్‌ భాగంలో న్యూస్‌ పేపర్ల ముక్కలు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై వైద్యులు ప్రశ్నించగా, తానే పెట్టుకున్నట్టు వెల్లడించినట్టు సమాచారం. ఆ తర్వాత వైద్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి పంపారు. దీనిపై ప్రభుత్వాసుపత్రి వైద్యులు మెడికో లీగల్‌ కేసు నమోదు చేసి భవానీపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సమక్షంలో బాలిక వాంగ్మూలం తీసుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్‌ బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి కాగితాలను పెట్టినట్టు బాలిక వెల్లడించింది. దీనిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కరస్పాండెంట్‌ వయస్సు 60 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. విజయవాడ పశ్చిమ డివిజన్‌ ఏసీపీ దుర్గారావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక వచ్చాక వాస్తవం తెలుస్తుందన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 05:19 AM