Share News

వయసు 25.. కేసులు 22

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:16 AM

అసలు పేరు.. గాదె సాయికృష్ణ. స్నేహితులు, పోలీసులకు మాత్రం పిల్ల సాయిగా పరిచయం. ఇదికాకుండా మరో పేరుంది. అదే.. బాషా. విజయవాడ పోలీసుల రికార్డుల్లో అతడో రౌడీషీటర్‌.

వయసు 25.. కేసులు 22

  • రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ నేరచరిత ఇదీ

  • గంజాయి, దోపిడీ, పోక్సో, హత్య కేసులు

  • రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారు టార్గెట్‌

  • అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బ్లేడ్‌తో దాడి

  • బాలికలను ప్రలోభపెట్టి అత్యాచారాలు

  • విజయవాడలో రౌడీషీటర్‌ పిల్లసాయిగా ముద్ర

  • 12 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదు

  • కృష్ణలంకలో నిఘా పెరగడంతో చిల్లకల్లుకు మకాం

  • అక్కడే మద్యం పార్టీలో సస్పెక్ట్‌ షీట్‌ నవీన్‌రెడ్డి హత్య

  • అ‘దృశ్యం’ నేపథ్యంలో గత చరిత్రపై సర్వత్రా చర్చ

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

అసలు పేరు.. గాదె సాయికృష్ణ. స్నేహితులు, పోలీసులకు మాత్రం పిల్ల సాయిగా పరిచయం. ఇదికాకుండా మరో పేరుంది. అదే.. బాషా. విజయవాడ పోలీసుల రికార్డుల్లో అతడో రౌడీషీటర్‌. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌. వయసు 25.. కేసులు ఏమో 22! గంజాయి, దోపిడీ, పోక్సో, హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. ఈ రౌడీషీటర్‌ సాయికృష్ణ అదృశ్య ఘటన సంచలనంగా మారింది. ఇన్ని నేరాలున్న సాయికృష్ణను వైసీపీ భుజాన వేసుకుని మోస్తోంది. అతడి అదృశ్యం కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు సస్పెండ్‌ అయ్యారు. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లారు. ఈ తరుణంలో అసలు గాదె సాయికృష్ణ ఎవరు? అతడి నేరచరిత్ర ఏంటి? అన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. విజయవాడలోని కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన సాయికృష్ణ అలియాస్‌ పిల్ల సాయి తండ్రి నాగేశ్వరరావు, తల్లి విజయలక్ష్మి. ఈ దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి వివాహం చేసుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటోంది. తండ్రి నాగేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. భార్యతో విడిపోయినట్టు తెలుస్తోంది. కృష్ణలంకలోని ప్రైవేట్‌ కాన్వెంట్‌లో సాయికృష్ణ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అతడు పుస్తకాలకు బదులు ఆయుధాలు పట్టుకోవడం మొదలుపెట్టాడు. 11 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదయ్యాయి.


బెదిరింపులు.. బ్లేడ్‌తో కోతలు

రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారిని ఆపడం, డబ్బు కోసం బెదిరించడం పిల్ల సాయి ప్రధాన నేరాలు. అడిగినంత ఇవ్వకపోతే జేబులో నుంచి బ్లేడ్‌ తీసి ఇష్టానుసారంగా కోసేస్తాడు. తర్వాత వస్తువులు, డబ్బు తీసుకుని పారిపోతాడు. అతడిపై ప్రస్తుతం రెండు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో, ఒక వారెంట్‌ మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. గుణదలలో పడవలరేవు వంతెన వద్ద ఉన్న క్యాన్సర్‌ ఆసుపత్రి సమీపంలో 2021లో రౌడీషీటర్లు చిన్న రాజా, పెద్ద రాజా, నతానియల్‌తో కలిసి ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడిచేసి డబ్బు లాక్కున్నాడు. దీనిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పిల్ల సాయి వాయిదాలకు గైర్హాజరవ్వడంతో న్యాయస్థానం ఏప్రిల్‌ 7న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. గంజాయి తీసుకున్నా, మద్యం తాగినా పిల్ల సాయి ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఆ సమయానికి చేతిలో ఉన్న ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేస్తాడని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్నిసార్లు బాషాగా..

పిల్ల సాయి కొన్ని సందర్భాల్లో బాషా పేరుతో చలామణి అయినట్టు సమాచారం. మాచవరం పీఎస్‌లో నమోదైన కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో అతడి పేరును బాషాగా పేర్కొన్నారు. ఈ కేసులో అతడు కోర్టు విచారణకు హాజరుకావడం లేదు. 2024 ఆగస్టులో మాచవరం స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ కోర్టులో సాయి తల్లి విజయలక్ష్మిని చూశారు. బాషా అంటే ఎవరని అడిగితే ఆమె తెలియదని సమాధానం ఇచ్చింది.


బాలికలపై అత్యాచారాలు

అసలు పేరు గాదె సాయికృష్ణ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి అదృశ్యమైన తర్వాతే ఆ పేరు బాహ్య ప్రపంచానికి తెలిసింది. పిల్ల సాయి అంటే మాత్రం విజయవాడ నగరంలో ఇట్టే గుర్తుపడతారు. బాలికలను ప్రలోభపెట్టి అత్యాచారాలు చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని కృష్ణలంకలో కొందరు చెబుతున్నారు. చిన్న వయసు నుంచే నేరాలు చేయడంతో పిల్ల సాయి పేరు వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఓ బాలికను ప్రలోభపెట్టి ఇంటి నుంచి బయటకు రప్పించి లాడ్జీలో బంధించాడు. తర్వాత స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడు. దీనిపై క్రైం నంబరు 109/2017తో కృష్ణలంక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కోర్టు కొట్టేసింది.

ఇన్‌స్టాలో వీడియోలు

పిల్ల సాయి కృష్ణలంకలోని రాజీవ్‌నగర్‌లో ఉంటూనే అరాచకాలు చేసేవాడు. ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని వాళ్లందరినీ ఫ్యాన్స్‌గా చూపించేవాడు. ఇన్‌స్టాలో అతడి పేరున రెండు, మూడు అకౌంట్లు ఉన్నాయి. ఇవికాకుండా పిల్ల సాయి ఫ్యాన్స్‌ పేరుతో మరో ఇన్‌స్టా అకౌంట్‌ ఉంది. కృష్ణలంక సమీపాన ఉన్న కృష్ణానది ఘాట్లపై, కనకదుర్గ వారధి కూడలిలో అనుచరులతో వీడియోలు చిత్రీకరించి, వాటికి సినిమాల్లో డైలాగ్‌లను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టి ఇన్‌స్టాలో పోస్టు చేసేవాడు. ఎదుటివారిని బెదిరించే విధంగా ఈ రీల్స్‌ చేస్తుండేవాడు. ‘నేను నియంత్రణ కోల్పోతే నా ఎదురుగా నిలబడడానికి భయపడాలి’ అన్నది పిల్ల సాయి ఫేమస్‌ డైలాగ్‌.


చివరి కేసు ఇదే

కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లు, గంజాయి బ్యాచ్‌లపై నిఘా పెరగడంతో పిల్ల సాయి మకాం మార్చేశాడు. ఇక్కడి నుంచి పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్టుగా చెప్పుకొన్నాడు. ప్రతి ఆదివారం స్టేషన్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు రాకపోవడంతో పోలీసులు ఇంటికి వెళ్లేవారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిపోయాడని తల్లి విజయలక్ష్మి చెప్పడంతో అదే రికార్డుల్లో రాసుకునేవారు. పిల్ల సాయి క్రమంగా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు చేరుకున్నాడు. అక్కడ ఒక గదిలో అద్దెకు ఉంటూ చుట్టుపక్కల వారికి తానొక కూలీనని చెప్పుకొన్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులతో స్నేహం ఏర్పడింది. వారిలో ఒక స్నేహితుడికి బాబు జన్మించడంతో పార్టీ ఇస్తానని చెప్పాడు. దానికి పిల్ల సాయి విజయవాడ భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉన్న అలవల నవీన్‌రెడ్డి అలియాస్‌ నవీన్‌ను ఆహ్వానించాడు. 2025 డిసెంబరు 4న రాత్రి చిల్లకల్లులోని ఓ సిమెంట్‌ కర్మాగారం వెనుక ఖాళీ ప్రదేశంలో మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నవీన్‌రెడ్డి, పిల్ల సాయి మధ్య సెల్‌ఫోన్‌ విషయంలో వాగ్వాదం జరిగింది. నవీన్‌రెడ్డిపై పిల్ల సాయి చేయి చేసుకోవడంతో అతడు పక్కన ఉన్న కర్ర తీసుకుని కొట్టాడు. ఆవేశంతో ఊగిపోయిన సాయి బీరు సీసాను పగులగొట్టి నవీన్‌రెడ్డిని మెడ, ఛాతీ పైభాగంలో పొడిచాడు. కొన ఊపిరితో ఉన్న నవీన్‌రెడ్డిని ద్విచక్రవాహనంపై జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రి వరకు తీసుకొచ్చి, ఆవరణలో మృతదేహాన్ని పడేసి పారిపోయాడు. ఈ కేసులో నందిగామ కోర్టు అతడికి రిమాండ్‌ విధించింది. ఈ ఏడాది మార్చిలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ నవీన్‌రెడ్డి మృతదేహం ఫొటోలనే వైసీపీ నేతలు పిల్ల సాయి ఫొటోలుగా ప్రచారం చేయడం గమనార్హం.


ఇదీ కేసుల లెక్క

పిల్ల సాయిపై మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. వాటిలో నాలుగు కేసుల్లో అతడికి న్యాయస్థానాలు శిక్షలు విధించాయి. ఏడు కేసులు లోక్‌ అదాలత్‌లో రాజీ అయ్యాయి. నాలుగు కేసులను న్యాయస్థానాలు కొట్టేశాయి. మరో నాలుగు కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. మూడు కేసులు కోర్టుల్లో ట్రయల్‌కు పెండింగ్‌లో ఉన్నాయి. అతడిపై ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కృష్ణలంక, మాచవరం, పటమట, ఇబ్రహీంపట్నం, సూర్యారావుపేట, చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో పెనమలూరు, గుంటూరు జిల్లాలో తాడేపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో బొమ్మూరు పోలీస్‌ స్టేషన్లలోనూ పిల్ల సాయిపై కేసులు నమోదయ్యాయి. 22 కేసుల్లో 12 కేసులు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లోనే నమోదుకావడం గమనార్హం.

Updated Date - Jun 29 , 2026 | 05:17 AM