Share News

బెజవాడ సీపీ రాజశేఖర్‌కు ‘అతి ఉత్కృష్ట సేవా’ పతకం

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:06 AM

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర బాబు.. ముఖ్యమంత్రి చీఫ్‌ సెక్యూరిటీ అధికారి మధుసూదన్‌ పనితీరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమున్నత గౌరవం లభించింది.

బెజవాడ సీపీ రాజశేఖర్‌కు ‘అతి ఉత్కృష్ట సేవా’ పతకం

  • సీఎం సీఎస్‌వో మధుసూదన్‌కు ‘అత్యుత్తమ సేవ’

  • డ్రైవర్‌ గిరిబాబుకు ‘ఉత్తమ సేవ’ పురస్కారాలు

అమరావతి/విజయవాడ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర బాబు.. ముఖ్యమంత్రి చీఫ్‌ సెక్యూరిటీ అధికారి మధుసూదన్‌ పనితీరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమున్నత గౌరవం లభించింది. పాతికేళ్ల క్రితం పోలీసు శాఖలో చేరి పలు జిల్లాల ఎస్పీగా, ప్రస్తుతం విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజశేఖరబాబు శాంతి భదత్రల పరిరక్షణ, కేసుల దర్యాప్తులో అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆయన సీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బెజవాడ పోలీస్‌ కమిషనరేట్‌ను టెక్నాలజీపరంగా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టారు. జిల్లా మొత్తాన్ని నిఘా నీడలో ఉంచడానికి ప్రజలను, కాలనీ సంఘాలను భాగస్వాములు చేసి ‘ఆపరేషన్‌ సురక్ష’ చేపట్టారు. ఇందులో మొత్తం 10 వేల సీసీ కెమెరాలను అమర్చారు. ఆయన పనితీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి ‘అతి ఉత్కృష్ట’ సేవా పతకాన్ని ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రముఖుల భద్రత చూసుకునే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న మధుసూదన్‌ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం అందించే మహోన్నత సేవా పతకం లభించింది. మూడు దశాబ్ధాల క్రితం పోలీసు శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరిన మధుసూదన్‌ ఏడేళ్లుగా సీఎం భద్రతా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. అలాగే, ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి చంద్రబాబు కాన్వాయ్‌ డ్రైవర్‌గా పనిచేస్తోన్న గిరిబాబుకు ప్రభుత్వం ఉత్తమ సేవా పతకం ప్రకటించింది.

Updated Date - Mar 18 , 2026 | 05:08 AM