Share News

హైటెక్‌ టెర్రర్‌!

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:37 AM

అనూహ్య రీతిలో వెలుగులోకి వస్తున్న ఉగ్రవాద కదలికలు రాష్ట్రంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో విజయనగరం జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు తుపాకులు పేల్చే శిక్షణ పొందడం....

హైటెక్‌ టెర్రర్‌!

  • సోషల్‌ మీడియా వేదికగా రిక్రూట్‌మెంట్లు

  • తాజాగా బెజవాడలో ముగ్గురు యువకుల అరెస్ట్‌... 6 వరకు రిమాండ్‌

(అమరావతి, విజయవాడ)

అనూహ్య రీతిలో వెలుగులోకి వస్తున్న ఉగ్రవాద కదలికలు రాష్ట్రంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో విజయనగరం జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు తుపాకులు పేల్చే శిక్షణ పొందడం, ఐఈడీ పేలుళ్లకు ప్రయత్నాలు చేయడం గత ఏడాది మే నెలలో పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది. రాయల సీమలోని రాయచోటి ప్రాంతంలో అల్‌ ఉమ్మా అనే నిషేధిత సంస్థకు చెందిన అబుబక్కర్‌ సిద్ధిఖీ(అమానుల్లా), మహమ్మద్‌ అలీ(మన్సూర్‌)లను గత ఏడాది జూలైలో పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియా ద్వారా యువతలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను బెజవాడ పోలీసులు తాజాగా నిర్బంధించారు. ఈ మూడు ప్రాంతాల పరిధిలో నమోదైన మూడు కేసుల్లో మూడు రకాల మాడ్యూల్స్‌ వెలుగులోకి వచ్చాయి. లక్ష్యం మాత్రం దాదాపు ఒక్కటే. సోషల్‌ మీడియా ద్వారా మత ఉన్మాదాన్ని వ్యాప్తి చేయడం!


ఐఎస్‌ వైపు విజయనగరం సిరాజ్‌..

విజయనగరానికి చెందిన 29ఏళ్ల సిరాజ్‌-ఉర్‌-రెహ్మాన్‌ ఇంజనీరింగ్‌లో ఐఎస్‌ ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. హైదరాబాద్‌, బిహార్‌ తదితర ప్రాంతాలకు చెందిన సయ్యద్‌ సమీర్‌, ఆరిఫ్‌ హుస్సేన్‌, ఇమ్రాన్‌ అక్రమ్‌తో కలిసి పేలుడు పదార్థాలు సేకరించి దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నాడు. ఏపీ ఇంటెలిజెన్స్‌ అప్రమత్తం అవడంతో సిరాజ్‌ను విజయనగరం పోలీసులు గత ఏడాది మే నెలలో అరెస్టు చేసి విచారించగా, దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన యువతలో సోషల్‌ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలం నింపే ప్రయత్నం చేస్తున్నట్టు బయటపడింది. ఈ పద్ధతిలో ఐసి్‌సలోకి యువతను చేర్పించడం, దేశంలో విధ్వంసం సృష్టించడం లక్ష్యంగా తేలింది. ఆన్‌లైన్లో అల్యూమినియం పొడి, సల్ఫర్‌ వంటివి కొనుగోలు చేయడం వెనుక ఐఈడీల తయారీ ఆలోచన ఉన్నట్టు స్పష్టమైంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో మాత్రమే ఇప్పటివరకూ ఉగ్ర కార్యకలాపాలు, పేలుళ్లు సంభవించాయి.


టీ స్టాల్‌ నిర్వహిస్తూ..

ధర్మవరంలో టీ స్టాల్‌ నిర్వహించే నూర్‌ మహమ్మద్‌ సమాజ సేవ పేరుతో స్థానిక యువతతో కలిసి సోషల్‌ మీడియా గ్రూపులు ఏర్పాటు చేశాడు. తన ప్రణాళికలో భాగంగా జైష్‌ ఏ మహమ్మద్‌, సదాయి-జిహాద్‌, మఖ్బుజ్‌కి ఆవాజ్‌ వంటి పాకిస్థాన్‌ తీవ్రవాద సంస్థలు నడుపుతున్న 30 సోషల్‌ మీడియా(వాట్సాప్‌, సిగ్నల్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటివి) గ్రూపులలో చేరాడు. మహారాష్ట్రకు చెందిన తౌపిక్‌ ఆలం షేక్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సజ్జాద్‌ హుసేన్‌ వంటి వారితో కలిసి దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతుండటంతో ఎన్‌ఐఏ అధికారులు, సత్యసాయి పోలీసులు నిరుడు ఆగస్టులో అరెస్టు చేశారు.


విజయవాడ యువకులకు ఏడేసి ఖాతాలు

విజయవాడ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులకు చిక్కిన మహ్మద్‌ రహ్మతుల్లా షరీఫ్‌, మహ్మద్‌ దానిష్‌, మీర్జా సోహైల్‌ బేగ్‌ల విచారణలో దిగ్భ్రమ కలిగించే అంశాలెన్నో వెలుగు చూసినట్టు తెలిసింది. ఈ ముగ్గురూ ఎవరితో పరిచయం పెంచుకుని, ఎలా జిహాదీ సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నారనేది రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. రెహ్మతుల్లా సామాజిక మాధ్యమాల ద్వారా ఇస్రార్‌ అహ్మద్‌, జకీర్‌ నాయక్‌తో పరిచయాలు పెంచుకున్నాడు. వారి ప్రోత్సాహంతో ఏక్యూఐఎస్‌ (అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌), ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌) కార్యకలాపాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. జిహాదీ కార్యకలాపాలను నిర్వహించే ఉగ్రవాద సంస్థల సామాజిక మాధ్యమాల వేదికలకు దగ్గరయ్యాడు. ఆయా ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేయడం మొదలుపెట్టాడు. దేశంలో ఖిలాఫత్‌(ఇస్లాం రాజ్యం) స్థాపన లక్ష్యంగా పనిచేయాలంటూ ప్రచారం చేసేవాడు. ఆయా సంస్థలతో పరిచయాలు పెరిగిన తర్వాత రెహ్మతుల్లా భవానీపురానికి చెందిన మహ్మద్‌ దానిష్‌, మహంతిపురానికి చెందిన మీర్జా సోహైల్‌ బేగ్‌లను ఇందులోకి దించాడు. ఈ ముగ్గురు కలిసి సామాజిక మాధ్యమాల్లో జిహాదీ భావజాలాన్ని చురుకుగా వ్యాప్తి చేస్తున్నారు. విదేశంలో ఉంటున్న అల్‌ హకీమ్‌ షుకూర్‌ అనే వ్యక్తితో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నారు. సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తున్న అతడు జిహాద్‌ వైపు వారిని ప్రేరేపించాడు. బిహార్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు సానుభూతిపరులుగా ఉన్న వారిని ఈ ముగ్గురు యువకులకు పరిచయం చేశాడు. ఏక్యూఐఎస్‌తో సంబంధం ఉన్న బిహార్‌కు చెందిన షద్మన్‌ దిల్కష్‌, హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగంను కలవాలని సూచించాడు. ఈ ముగ్గురు యువకులు ఒక్కొక్కరు వేర్వేరు పేర్లతో ఏడు ఈ మెయిల్‌ ఐడీలు, ఇన్‌స్టా అకౌంట్లను సృష్టించుకుని ఉగ్ర సానుభూతిపరులుగా పనిచేస్తున్నారు.


బెనెక్స్‌ కామ్‌ గ్రూపు ఏర్పాటు

ఐఎస్‌తో సంబంధాలు ఉన్న కొంతమంది ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. దీనికి బెనెక్స్‌ కామ్‌ అని పేరు పెట్టారు. బిహార్‌కు చెందిన అజ్మతుల్లా ఖాన్‌, ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన మిర్‌ ఆషిఫ్‌ అలీ, రాజస్థాన్‌కు చెందిన జిషాన్‌, కర్ణాటకకు చెందిన అబ్దుల్‌ సలాం, మహారాష్ట్రకు చెందిన షారూక్‌ ఖాన్‌, షేక్‌ ఫయాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ ఈ గ్రూపును క్రియాశీలంగా నిర్వహిస్తున్నారు. బెనెక్స్‌ కామ్‌ గ్రూపు సభ్యులను కలిసి, వారికి అనుబంధంగా పనిచేయాలని అల్‌ హకీమ్‌ షుకూర్‌ ఈ ముగ్గురికీ ఆదేశాలు ఇచ్చాడు. కాగా, విజయవాడ పోలీసులు ఈ ముగ్గురు యువకులపై ఉపా చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకులను పోలీసులు విజయవాడ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. న్యాయాధికారి బి.రాధారాణి వచ్చే నెల ఆరో తేదీ వరకు వారికి రిమాండ్‌ విధించగా, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

Updated Date - Mar 25 , 2026 | 04:39 AM