Share News

పిస్టల్‌ కాదు.. లైటర్‌!

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:14 AM

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పిస్టల్‌ అనుకుంటున్నారా.. మీరే కాదు పోలీసులు ఇలాగే పొరబడ్డారు. తీరా.. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాక అది పిస్టల్‌ మాదిరి లైటర్‌ అని తెలిసి విస్తుపోయారు!.

పిస్టల్‌ కాదు.. లైటర్‌!

  • ఓ కేసులో కారును ట్రాక్‌ చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది

  • పరారవుతుండగా వెంటాడి పట్టుకున్న ట్రాఫిక్‌ పోలీసులు

విజయవాడ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఈ చిత్రంలో కనిపిస్తున్నది పిస్టల్‌ అనుకుంటున్నారా.. మీరే కాదు పోలీసులు ఇలాగే పొరబడ్డారు. తీరా.. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాక అది పిస్టల్‌ మాదిరి లైటర్‌ అని తెలిసి విస్తుపోయారు!. వివరాలివీ.. మైలవరానికి చెందిన కుంభా గోవిందు అలియాస్‌ వజ్ర.. హోటళ్లు, రెస్టారెంట్లు, కిరణా షాపుల్లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినప్పుడు వారి వెంట వెళ్తుంటాడు. తానొక మీడియా ప్రతినిధినంటూ వీడియోలు చిత్రీకరిస్తుంటాడు. అధికారులు వెళ్లిపోయాక.. ఆయా సంస్థల యజమానుల వద్దకు వెళ్లి కేసులు లేకుండా చూస్తానని చెప్పి డబ్బు వసూలు చేస్తుంటాడు. అతడి కారు ముందుభాగంలో ప్రెస్‌ అని, వెనుక వైపు ఏపీయూడబ్ల్యూజే అని స్టిక్కర్లు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వజ్ర అజ్ఞాతంలో ఉండగా, పోలీసులు అతడి కారుపై నిఘా పెట్టారు. ఆదివారం రాజీవ్‌నగర్‌కు చెందిన వరసకు సోదరుడైన కుంభా శివను కారులో ఎక్కించుకుని వజ్ర వెళ్తుండగా, సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సిబ్బంది ట్రాక్‌ చేశారు. అజిత్‌సింగ్‌నగర్‌ వైపు నుంచి ప్రకాశ్‌నగర్‌ వైపునకు వెళ్తుండగా ట్రాఫిక్‌ పోలీసులు కారును ఆపగానే వజ్ర తాళం తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో శివను అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా, అందులో పిస్టల్‌ కనిపించింది. పోలీసులు వెంటనే నున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివను, పిస్టల్‌ను తీసుకుని స్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌ ఆలీ పిస్టల్‌ను పరిశీలిస్తూ ట్రిగ్గర్‌ నొక్కగానే బారల్‌ నుంచి మంట వచ్చింది. దీంతో పోలీసులు కంగుతిన్నారు. అదొక పిస్టల్‌ మాదిరిగా ఉండే లైటర్‌ అని నిర్ధారించారు. లైటర్‌ను, కారును మైలవరం పోలీసులకు అప్పగించారు.

Updated Date - Aug 24 , 2026 | 05:15 AM