అనాథ శవాలపై ఆరా
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:33 AM
విజయవాడకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతనెల 6న మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో..
రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు వేగవంతం
కృష్ణలంకలోని స్వర్గపురిలో పోలీసుల విచారణ.. తనిఖీలు
విజయవాడ, జూన్ 20(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతనెల 6న మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉంచారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మాత్రం మిస్టరీగా ఉంది. సాయికృష్ణ కుటుంబీకుల ఆరోపణల మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న స్వర్గపురికి ప్రత్యేక బృందాన్ని పంపారు. పటమట ఇన్‌స్పెక్టర్ వి. పవన్ కిశోర్‌తో కూడిన ఈ బృందం శనివారం స్వర్గపురి కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేసింది. మృతదేహాల వివరాలు రికార్డులు నిర్వహించే డేటా ఆపరేటర్ రవితో పాటు ఎలక్ట్రికల్ క్రిమిటోరియం నిర్వాహకుడు బాషాను సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదరరావు విచారించారు. కాగా, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గతనెల 23న మొత్తం నాలుగు అనాథ మృతదేహాలను పోలీసులు గుర్తించి, స్వర్గపురికి తరలించారు. దీనికి సంబంధించి నగర పాలక సంస్థకు పోలీస్ స్టేషన్ నుంచి లేఖలు వెళ్లాయి. వాటిలో రెండు మృతదేహాలను 24న ఎలక్ర్టిక్ క్రీమిటోరియంలో దహనం చేశారు. రాత్రిపూట వచ్చిన రెండు మృతదేహాల విషయంలో కాటికాపరి శివకు, పోలీసులకు మధ్య చిన్నవివాదం జరిగింది. సాయంత్రం 6గంటలు దాటిన తర్వాత మృతదేహాలను లోపలకు అనుమతించరు. రాత్రిపూట తీసుకెళ్లిన శవాలను తీసుకోవడానికి నిరాకరించిన శివ... శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పారు.
దీంతో ఆ మృతదేహాలను తీసుకుని బాక్స్‌లో భద్రపరచమని ఆయన ఆదేశించారు. వాటిని 26న దహనం చేశారు. ఈ నాలుగు మృతదేహాల వయసు 42- 50 ఏళ్ల మధ్య ఉన్నట్టు రికార్డుల్లో నమోదైంది. అదృశ్యమైన సాయికృష్ణ వయసు 25 ఏళ్లు ఉంటుందని తల్లి విజయలక్ష్మి పేర్కొన్నారు. స్వర్గపురిలో ఆ వయసున్న యువకుల మృతదేహాలకు సంబంధించి వివరాలు ఏమీ లేకపోవడంతో పోలీసులు అక్కడినుంచి వెనుదిరిగారు. కాగా, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో క్లూస్ టీం సేకరించిన నమూనాలు, సీసీ కెమెరాల హార్డ్‌డి్‌స్కను విశ్లేషణ నిమిత్తం మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు తరలించారు. సీసీ ఫుటేజీని విశ్లేషించడానికి హార్డ్‌డిస్క్‌ను ‘ఈ’ ఫోరెన్సిక్ విభాగానికి ఇచ్చారు.