Share News

వైసీపీ నాయకులకు సిగ్గుండాలి

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:41 AM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నాయకులకు సిగ్గుండాలి

  • ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది

  • చార్జిషీట్‌ 35వ పేజీలో సిట్‌ పేర్కొంది: మంత్రి పయ్యావుల

అమరావతి/తెనాలి/కందుకూరు/నిడదవోలు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్‌ దాఖలు చేసిన 219 పేజీల చార్జిషీట్‌లోని 35వ పేజీలో లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు(టాలో), ఫిష్‌ ఆయిల్‌ ఆనవాళ్లు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కల్తీ నెయ్యి వాడకానికి జగన్‌ ప్రభుత్వ హయాంలోనే పునాది పడింది. 2014-19లో లడ్డూ నాణ్యత కోసం చంద్రబాబు విధించిన కఠిన నిబంధనలన్నింటినీ జగన్‌ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే సడలించారు. 2022లోనే నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చి శాంపుల్స్‌ను మైసూరులోని సీఎ్‌ఫటీఆర్‌ఐకి పంపగా అందులో జంతు అవశేషాలు ఉన్నట్లు నివేదిక వచ్చింది. అయినా కూడా అదే కల్తీ నెయ్యిని వాడుతూ వచ్చారు. కల్తీ నెయ్యి సరఫరాలో రూ.240 కోట్ల అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా సిట్‌ నిర్ధారించింది. అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాకు రూ.4 కోట్లు బదిలీ అయ్యాయి. ఆ డబ్బులు వేరే ఖాతాల్లోకి తరలించారని, ఆ ఖాతాలు ఎవరివో తేలాల్సి ఉంది.’ అని మంత్రి వివరించారు. దేవదేవుడి విషయంలో మహాపచారం చేసి, ఇప్పుడు క్లీన్‌చిట్‌ వచ్చిందంటూ సంబరాలు చేసుకోవడానికి వైసీపీ నాయకులకు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుప్పం పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఉన్నతస్థాయి చర్చలు జరిపి కల్తీ నెయ్యి ఉదంతంపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయిస్తారని పయ్యావుల తెలిపారు.


అందరి బాగోతాలు బయటికొస్తాయి: మంత్రి ఆనం

కల్తీ నెయ్యి వ్యవహారంలో అందరి బాగోతాలు బయటికొస్తాయని, తమ ప్రమేయం లేదని సిట్‌ తేల్చిందంటూ వైసీపీ నేతలు చంకలు గుద్దుకోవటం చోద్యంగా ఉందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. సిట్‌ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించిందని, అది ప్రభుత్వానికి చేరాకే బయటికొస్తుందని తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసలు అది నెయ్యే కాదని తేల్చినప్పుడు కల్తీ జరగలేదని సిట్‌ నివేదిక ఇచ్చిందని, ఈ వ్యవహారంలో వైసీపీ పెద్దల ప్రమేయం లేదని కూడా తెలిపిందంటూ ఆ పార్టీ నేతలు సంబరాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై మంత్రి ఆనం తీవ్రంగా స్పందించారు. గౌరవప్రదమైన నాయకుడిని టీడీపీ కార్యకర్తల పాదధూళికి కూడా సరిపోని నాయకుడు నోటికొచ్చిన పదజాలంతో మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని ఆనం పేర్కొన్నారు.


సిగ్గు అనిపించడం లేదా?: మంత్రి మనోహర్‌

‘‘టీటీడీకి మీరు సరఫరా చేసిన 60 లక్షల లీటర్లలో ఒక్క చుక్క కూడా నెయ్యి లేదు. వాసన మినహా రసాయనాలతో కూడిన విషాన్ని భక్తులకు పంచారు. పైగా ఇప్పుడు క్లీన్‌చిట్‌ వచ్చిందంటూ రోడ్డెక్కి హడావుడి చేయడానికి సిగ్గు అనిపించడంలేదా?’’ అంటూ వైసీపీ నేతలపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. చార్జిషీట్‌ దాఖలు చేస్తేనే క్లీన్‌చిట్‌ వచ్చేసిందంటూ అసత్య ప్రచారంతో ఇంకా ప్రజలను దారుణ మోసానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేత అంబటి రాంబాబు తన బూతు పాండిత్యాన్ని ప్రదర్శించారని, ఏకంగా సీఎం చంద్రబాబునే బూతులు తిట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు.

కల్తీ నెయ్యి వాడకం ముమ్మాటికీ పాపమే: మంత్రి దుర్గేశ్‌

లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై వైసీపీ నేతలు చేస్తున్న వాదనలను మంత్రి కందుల దుర్గేశ్‌ తీవ్రంగా ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడటం ముమ్మాటికీ పాపమేనని అన్నారు. దీనిపై వైసీపీ కల్తీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దొంగతనం బయటపడిన తర్వాత వైసీపీ నేతలు దొంగనాటకాలు ఆడటం సిగ్గుచేటని విమర్శించారు. కమిషన్ల కోసమే నిబంధనలు సడలించి ‘భోలేబాబా‘ సంస్థకు అప్పటి ప్రభుత్వం టెండర్లు ఇచ్చిందని, దీనిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 04:42 AM