భార్య వైద్యం కోసం మోసగాడి అవతారం!
ABN , Publish Date - May 19 , 2026 | 04:49 AM
అతడు పక్కా ప్లాన్ ప్రకారం బ్యాంకులను బోల్తా కొట్టించిన ఘరానా మోసగాడు! రెండు డజన్లకు పైగా మ్యూల్ ఖాతాలు, ఒక షెల్ కంపెనీ సృష్టితో ఏకంగా రూ.5.28 కోట్ల రుణాలు తీసుకొని టోకరా వేశాడు.
26 మ్యూల్ ఖాతాలతో రూ.5.28 కోట్ల రుణాలు
ఫేక్ ఖాతాలు, షెల్ కంపెనీతో బ్యాంకులకు టోకరా
భార్య చనిపోయినా.. అక్రమ పంథా కొనసాగింపు
బ్యాంకు రుణాల సొమ్ముతో స్థిరాస్తుల కొనుగోలు
విజయవాడ, మే 18 (ఆంధ్రజ్యోతి): అతడు పక్కా ప్లాన్ ప్రకారం బ్యాంకులను బోల్తా కొట్టించిన ఘరానా మోసగాడు! రెండు డజన్లకు పైగా మ్యూల్ ఖాతాలు, ఒక షెల్ కంపెనీ సృష్టితో ఏకంగా రూ.5.28 కోట్ల రుణాలు తీసుకొని టోకరా వేశాడు. ఏడాది తర్వాత భార్య చనిపోయిన అనంతరం కూడా అదే పంథా కొనసాగించాడు. ఆదివారం రాత్రి పవన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 34 ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, ఒక కారు, ద్విచక్ర వాహనం, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, తొమ్మిది ఏటీఎం కార్డులు, ఐదు స్వైపింగ్ మిషన్లు, రూ.11,500 నగదు సీజ్ చేశారు. ఇవి కాకుండా అండ్రాయిడ్ ఫోన్లు, రెండు కంప్యూటర్లు, యాపిల్ హార్డ్‌డిస్క్, ఖరీదైన వాచ్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. సైబర్ క్రైమ్స్ డీసీపీ కె.కృష్ణప్రసన్న తెలిపిన వివరాలీ.. కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన నీలం పవన్ కుమార్ (45), అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి కుటుంబాలు దీనికి అంగీకరించపోవడంతో విజయవాడ వచ్చేసి కాపురం పెట్టారు. పవన్ ఈ-సేవా కేంద్రంలో పనిచేసేవాడు. కుమారుడు జన్మించాక భార్యకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. వైద్యం చేయించేందుకు తన వద్ద డబ్బులు లేకపోగా, అత్తమామలు, తల్లిదండ్రులు సహకరించే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఫొటోషాప్ పై తనకున్న పట్టును ఉపయోగించి డబ్బుల కోసం 2019 నుంచి మోసగాడి అవతారం ఎత్తాడు.
ఈ-సేవా కేంద్రానికి వచ్చే దరఖాస్తుదారుల ఓటరు, పాన్, ఆధార్ కార్డుల్లోని ఫొటోలను తారుమారు చేసి, తనకు పరిచయం ఉన్నవారితో మొదట సిమ్ కార్డులు కొనిపించి, పలు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌ల్లో 26 ఖాతాలు తెరిపించాడు. ఇందుకు వారికి రూ.5-10 వేలు ఇచ్చి, సిమ్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, ఏటీఎం కార్డు, చెక్‌బుక్‌లను తానే తీసుకునేవాడు. మరోవైపు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, గుడివాడతో పాటు విశాఖపట్నంలో రూమ్‌లు అద్దెకు తీసుకొని, వాటిలో ఒకదాని చిరునామాతో కంపెనీ ఉన్నట్టు చూపించాడు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో విజయవాడలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో కరెంట్ ఖాతా తెరిచాడు. అందులో రూ.5 లక్షల వరకు డబ్బులు జమ చేసి, దానిద్వారా యాక్సిస్ బ్యాంక్‌లోని మ్యూల్ ఖాతాలకు ప్రతినెల రూ.15-20 వేల వరకు బదిలీ చేస్తూ.. ఆ ఖాతాలనేమో తన కంపెనీలో పనిచేసే వారివిగా బ్యాంకర్లను నమ్మించాడు. వాటిపై ప్రీ అప్రూవ్డ్ రుణాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. నకిలీ జీఎస్టీ నంబర్లు, లేబర్ లైసెన్స్‌లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయగా.. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన చేయని బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేవారు. ఈ విధంగా ఇప్పటి వరకు పవన్ 5.28 కోట్ల రుణాలు పొందాడు.