30 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ!
ABN , Publish Date - May 27 , 2026 | 05:38 AM
‘30 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ. ఈ సీటులో కూర్చుని ఎన్నో చూశాం. జీపు ఫైట్ వ్యవహారంలో ఆ యువకులు ఏం చేశారో ప్రపంచమంతా చూసింది’ అని విజయవాడ నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి యు.రామ్మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘జీపు ఫైట్’లో ఆ ఇద్దరు ఏం చేశారో ప్రపంచమంతా చూసింది
న్యాయాధికారి ఘాటు వ్యాఖ్యలు
విజయవాడ, మే 26(ఆంధ్రజ్యోతి): ‘30 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ. ఈ సీటులో కూర్చుని ఎన్నో చూశాం. జీపు ఫైట్ వ్యవహారంలో ఆ యువకులు ఏం చేశారో ప్రపంచమంతా చూసింది’ అని విజయవాడ నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి యు.రామ్మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానిక గురునానక్ కాలనీ టవర్ లేన్ రోడ్డులో జరిగిన జీపు ఫైట్ కేసులో మొదటి నిందితుడు బొల్ల ఓం తరపున న్యాయవాది హరికృష్ణను ఉద్దేశించి న్యాయాధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఓం జీపును తిరిగి ఇప్పించాలని, అతడి నుంచి సేకరించిన రక్త నమూనాలు, సీసీ కెమెరాల ఫుటేజీని, ప్రభుత్వాసుపత్రి రికార్డులను భద్రపరచాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హరికృష్ణ వాదనలు వినిపిస్తూ.. నిందితుడి అనుమతి లేకుండా రక్తనమూనాలే కాదు, తల వెంట్రుకా తీసుకోకూడదని వాదించారు. పోలీసులు రికార్డుల్లో పేర్కొన్న సాక్షులు ఆ సమయానికి విమాన ప్రయాణంలో ఉన్నారన్నారు. పోలీసులు ఫ్యాబ్రికేటెడ్ రికార్డును కోర్టుకు సమర్పించారని ఆరోపించారు. న్యాయధికారి స్పందిస్తూ.. కేసు దర్యాప్తు జరుగుతోందని, చార్జిషీటు దాఖలు తర్వాత ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. రక్తనమూనాల పరీక్షల వల్ల నిందితుడికే మేలు జరుగుతుందన్నారు. హరికృష్ణ ఇంకా వాదనలు వినిపిస్తుండగా ‘ఒకసారి నా సీటులో కూర్చుని చూడండి, అప్పుడు తెలుస్తుంది. 30 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ. గుండె తరుక్కుపోతోంది. ఆ యువకులు ఇద్దరూ ఏం చేశారో ప్రపంచమంతా చూసింది’ అని న్యాయాధికారి వ్యాఖ్యానించారు. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు.