Share News

పగ నుంచి పశ్చాత్తాపం వరకు!

ABN , Publish Date - May 25 , 2026 | 05:17 AM

ఉద్రేకంతో ఊగిపోయి ఒకరి అంతు మరొకరు చూసుకోవాలనుకున్న ఆ ఇద్దరు స్నేహితులు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు.

పగ నుంచి పశ్చాత్తాపం వరకు!

  • విజయవాడలో జీప్‌ ఫైట్‌ వెనుక కీలకంగా మారిన ఇగో సమస్య

  • పరస్పరం జీపులతో ఢీ.. నడివీధిలో సినిమాటిక్‌ స్టంట్లు..

  • పోలీసులకు చిక్కాక పశ్చాత్తాపం.. కన్నీటితో కలిసికట్టుగా జైలుకు

విజయవాడ, మే 24(ఆంధ్రజ్యోతి): ఉద్రేకంతో ఊగిపోయి ఒకరి అంతు మరొకరు చూసుకోవాలనుకున్న ఆ ఇద్దరు స్నేహితులు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. భారతీనగర్‌కు చెందిన బొల్ల ఓం, తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్‌ మధ్య స్నేహాన్ని తాడిగడపలోని బడ్డీకొట్టులో సిగరెట్‌ కలిపింది. రోహిత్‌ కంటే ఓం బలంగా ఉంటాడు. తాను ఇలా బలంగా ఉండడానికి స్టెరాయిడ్స్‌ కారణమని చెప్పాడు. జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసినంత మాత్రాన శరీరం సౌష్టవంగా మారదని, అందుకు స్టెరాయిడ్స్‌ ఉపయోగించాలని ఓం హితబోధ చేశాడు. దీంతో రోహిత్‌ కూడా వాడడం మొదలుపెట్టాడు. జీపులతో స్ట్రీట్‌ ఫైట్‌ తర్వాత పటమట పోలీసులు ఇద్దరికీ రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఓంకు డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇద్దరి మధ్య స్టెరాయిడ్స్‌ వినియోగంలో రెండు నెలలుగా వివాదం జరుగుతున్నట్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఓం ఇంట్లో సీ9 న్యూట్రిషన్‌ ఉత్పత్తులు, ఎల్‌-గ్లుటామైన్‌, ఫిష్‌ ఆయిల్‌, మల్టీ విటమిన్‌ బాటిళ్లు లభించాయి. రోహిత్‌ ఇంట్లో టెస్టోస్టెరాన్‌ కలిగి ఉన్న మల్టీ విటమిన్లు, నిషేధిత క్లెన్‌బుటెరోల్‌ హెచ్‌సీఎల్‌ టాబ్లెట్లు కనిపించాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. వాటి ప్రభావంతోనే ఇద్దరూ టవర్‌ రోడ్డులో భయానక వాతావరణాన్ని సృష్టించారని.. ప్రతీకారం తీర్చుకోవడానికే జీపుల వెనుక బేస్‌బాల్‌ బ్యాట్లను పెట్టుకుని తిరుగుతున్నారని వివరించారు. వారి రక్తనమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

Untitled-4 copy.jpg


ఓం దూకుడు

ఓం తండ్రి నాని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. మాజీమంత్రి జోగి రమేశ్‌ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. పలుమార్లు ఓం.. మాజీ సీఎం జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఫొటోలు దిగాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన జగన్‌ జన్మదిన వేడుకల్లో తాడేపల్లిలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించాడు. ఈ వీడియోలను ఓం ఇన్‌స్టాలో పోస్టు చేసుకున్నాడు. భారతీనగర్‌లో ఉండే ఓం థార్‌ జీపును చాలా వేగంగా నడుపుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం మాజీ కార్పొరేటర్‌ కోగంటి విమలకుమారి గురునానక్‌ కాలనీలో గృహప్రవేశానికి వెళ్లారు. ఆ సమయంలో ఓం జీపును వేగంగా ముందుకు వెనక్కి నడిపి ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయినట్టు తెలిసింది. కామన్‌ స్నేహితుల వద్ద ఓం.. తరచుగా రోహిత్‌ను తక్కువ చేసి మాట్లాడడంతో వివాదం ప్రారంభమైంది. తన గురించి చులకనగా మాట్లాడడాన్ని, స్నేహితుల వద్ద ప్రచారం చేయడాన్ని తట్టుకోలేక పోయిన రోహిత్‌ పగ పెంచుకున్నాడు. విషయం తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ‘రా తేల్చుకుందాం.’ అంటూ ఓం వాట్సా్‌పకు మెసేజ్‌లు పెట్టాడు. ఇలా ప్రారంభమైన రగడ.. ఇరువురూ తెల్లవారు జామున నడిరోడ్డుపై జీపులతో గుద్దుకుని.. స్టిక్స్‌తో కొట్టుకునే వరకు వెళ్లింది. చివరకు ఇరువురూ జైలు పాలయ్యారు. పగ, ప్రతీకారంతో రగిలిపోయిన ఇద్దరు స్నేహితులు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడుతున్నారు. కానీ అందుకు ఆలస్యమైంది. కలిసి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

Updated Date - May 25 , 2026 | 05:20 AM