నాగరాజుకు జేజేలు!
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:09 AM
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కొత్త పరిణామం సంభవించింది. ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై హత్యానేరం కింద కేసు నమోదైన తర్వాత ఆయనకు ప్రజల నుంచి మద్దతు వస్తోంది.
అరెస్టు ప్రచారంతో ఇంటికి చేరుకున్న మహిళలు
కృష్ణలంక ప్రశాంతంగా ఉండడానికి ఆయనే కారణం
సొంత డబ్బుతో సీసీ కెమెరాలు పెట్టించారు
ఆయనపై చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
మద్దతుగా మహిళల కొవ్వొత్తుల ర్యాలీ
సామాజిక మాధ్యమాల్లోనూ యువకుల మద్దతు
విజయవాడ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కొత్త పరిణామం సంభవించింది. ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై హత్యానేరం కింద కేసు నమోదైన తర్వాత ఆయనకు ప్రజల నుంచి మద్దతు వస్తోంది. నాగరాజును అరెస్టు చేస్తారన్న ప్రచారం జరగడంతో కృష్ణలంక, రాణిగారితోట, బాలాజీనగర్ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువకులు అజిత్‌సింగ్‌నగర్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ఆదివారం భారీగా చేరుకున్నారు. వేకువజాము నుంచే పోలీసులు ఆయన ఇంటి వద్ద కాపలా కాశారు. పోలీసులను చూడగానే మహిళలు, యువకులు నిరసనకు దిగారు. ఇన్‌స్పెక్టర్ నాగరాజును అరెస్టు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఆయనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజు కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌గా చేరాకే మహిళలు, అమ్మాయిలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆకతాయిల ఆటకట్టించారన్నారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో చూసి సిబ్బందిని పంపేవారని తెలిపారు. నేరగాళ్ల విషయంలో కఠినంగా ఉన్న ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు మద్దతుగా కృష్ణలంకలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
మీ వెంటే మేమూ..
సామాజిక మాధ్యమాల్లోనూ ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు మద్దతు పెరుగుతోంది. సింగం, శివమణి, ఖాకీ వంటి చిత్రాల్లో డైలాగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి నాగరాజు వీడియోలను వాట్సా్‌పలో స్టేట్‌సలుగా పెట్టుకుంటున్నారు. ఆయన ఫొటోలపై ‘ఐ స్టాండ్ విత్ నాగరాజు’ అని ట్యాగ్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న నాగరాజు వీడియోలకు సామాజిక కార్యకర్తలు మద్దతు పలుకుతున్నారు. ఆయనకు అండగా సామాజిక ఉద్యమాన్ని నిర్మిద్దామని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
మళ్లీ ‘బ్యాచ్‌లు’ చేరుతున్నాయి
కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌గా నాగరాజు లేరని తెలియడంతో బ్యాచ్‌లన్నీ మళ్లీ ఇక్కడికి చేరుతున్నాయి. ఆయన వచ్చిన రెండేళ్లలో కృష్ణలంక, రాణిగారితోట, బాలాజీనగర్ ప్రాంతాల్లో అమ్మాయిలు, మహిళలు ప్రశాంతంగా నిద్రపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఈ ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌లు అరాచకాలు సృష్టించాయి. నాగరాజు వచ్చాక ఆ బ్యాచ్‌లన్నీ పారిపోయాయి.
- రంగమ్మ, రాణిగారితోట