Share News

సాయికృష్ణ కేసు దర్యాప్తునకు ‘సిట్‌’

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:22 AM

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

సాయికృష్ణ కేసు దర్యాప్తునకు ‘సిట్‌’

అమరావతి/విజయవాడ, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఐజీ ర్యాంకు అధికారి ఎం.రవిప్రకాశ్‌(పీ అండ్‌ ఎల్‌) నేతృత్వం వహించనున్న ‘సిట్‌’లో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌, బాపట్ల అదనపు ఎస్పీ సుధాకర్‌ లోసారి సభ్యులుగా ఉంటారు. ఆదివారం హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన రవి ప్రకాశ్‌, సుధాకర్‌ లోసారి ఏసీబీలో పనిచేసిన సమయంలో నిజాయితీతో పాటు దర్యాప్తులో సూక్ష్మంగా పరిశీలిస్తారనే పేరుంది. ఎస్పీలు అద్నాన్‌, అమిత్‌ రాష్ట్రేతరులు కావడంతో ఎలాంటి ప్రశ్నలకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, హత్య, ఆధారాలు మాయం ఆరోపణలతో కొన్ని రోజులుగా సాయికృష్ణ కేసు సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సాయికృష్ణ తల్లితో మాట్లాడి న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు. సస్పెన్షన్‌లో ఉన్న కృష్ణలంక మాజీ సీఐ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజుపై ఆమె విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌ బాబుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో కేసు(107/2026) నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా విజయవాడ కమిషనరేట్‌తో సంబంధంలేని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్‌కు భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్ఎస్‌) ప్రకారం పూర్తి దర్యాప్తు అధికారాలు కల్పించింది. అవసరం మేరకు అదనపు సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఫోరెన్సిక్‌ సహాయాన్ని వినియోగించుకునే అవకాశం ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, వేగంగా, పూర్తిస్థాయి చట్టబద్ధతతో చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది.


కృష్ణలంక పీఎస్‌కు సిట్‌

సిట్‌ బృందం ఆదివారం సాయంత్రం కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. సిట్‌లో సభ్యుడిగా ఉన్న పల్నాడు అదనపు ఎస్పీ ఎల్‌.సుధాకర్‌తో పాటు కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు స్టేషన్‌కు వచ్చి విచారణ మొదలుపెట్టారు. వారితో పాటు మంగళగిరిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ సిబ్బంది వచ్చారు. లాక్‌పలు, ఇతర ప్రదేశాలను వారు పరిశీలించారు. సిట్‌ సభ్యుడు సుధాకర్‌కు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును మహిళా పీఎస్‌ ఏసీపీ దైవప్రసాద్‌ వివరించారు. సిట్‌ బృందం ఐదు ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు నమోదు చేసిన వాంగ్మూలాల రికార్డులను సిట్‌కు అప్పగించారు. వాటిని ల్యాప్‌టాప్‌ల్లో భద్రపరిచారు. స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని ఒక్కొక్కరిని పిలిచి విచారించారు.

Updated Date - Jun 22 , 2026 | 05:24 AM