Share News

టీచర్‌పై జిమ్‌ ట్రైనర్‌ అఘాయిత్యం

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:02 AM

జిమ్‌ ట్రైనర్‌.. ఇన్‌స్టాలో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఫిట్‌నెస్‌ టిప్స్‌ చెబుతానని జిమ్‌కు రప్పించుకున్నాడు. తర్వాత ఆమెకు మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు.

టీచర్‌పై జిమ్‌ ట్రైనర్‌ అఘాయిత్యం

  • మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. వీడియోలు చూపించి బ్లాక్‌బెయిల్‌

  • పోలీసులకు ఫిర్యాదు.. విజయవాడలో ఘటన

విజయవాడ/సత్యనారాయణపురం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జిమ్‌ ట్రైనర్‌.. ఇన్‌స్టాలో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఫిట్‌నెస్‌ టిప్స్‌ చెబుతానని జిమ్‌కు రప్పించుకున్నాడు. తర్వాత ఆమెకు మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు కాజేశాడు. ఇంకా వేధిస్తూ వీడియోలు వైరల్‌ చేశాడు. విజయవాడలో జరిగిన ఈ దారుణంపై బాధితురాలు సోమవారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. విజయవాడకు చెందిన ఆ యువతి ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. దేవీనగర్‌ మొదటి వీధికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ సత్యనారాయణపురంలోని రాక్‌ ఫిట్‌నెస్‌ వరల్డ్‌ జిమ్‌లో ట్రైనర్‌ ఉన్నాడు. 4 నెలల క్రితం అతడు ఇన్‌స్టాలో ఈ యువతిని పరిచయం చేసుకున్నాడు. లావుగా ఉన్నావని, ప్రొటీన్‌ షేక్‌లు తీసుకుని జిమ్‌ చేస్తే సన్నబడతావని చెప్పి జిమ్‌కు రప్పించుకున్నాడు. ఏప్రిల్‌లో.. పక్కనే ఉన్న హోటల్‌ గదికి రావాలని చెప్పి మత్తుమందు కలిపిన ప్రొటీన్‌ షేక్‌ ఇచ్చాడు. ఆమె తాగగానే స్పృహ కోల్పోయింది. రెండు గంటల తర్వాత మెలకువ వచ్చి లేచి చూడగా, ఒంటిపై దుస్తులు లేకపోవడాన్ని గుర్తించింది. నగ్న వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఐఫోన్‌ 16తో పాటు ఫోన్‌పే ద్వారా రూ.20 వేలు, రూ.50 వేలు దోచాడు. ఈ నేపథ్యంలో జూన్‌ 22న సత్యనారాయణపురంలోని హోటల్‌కు తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించి గాయపరిచాడు. మర్నాడు స్నేహితురాలి సాయంతో ఖాదర్‌ ఇంటికి వెళ్లి నిలదీయగా, కులం పేరుతో దూషించి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇంటికి వచ్చి గొడవ చేసిందన్న కక్షతో ఆమె నగ్నచిత్రాలు, వీడియోలను ఇతరులకు చూపించడం మొదలుపెట్టాడు. బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 21 , 2026 | 06:02 AM