వేధించడానికే కస్టడీ!
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:33 AM
‘రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి సీఐ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు సిట్ అధికారులకు చెప్పాల్సిందంతా చెప్పారు. చెప్పడానికి కొత్త విషయాలేమీ లేవు. ఆయనకు ప్రాణహాని ఉంది.
నాగరాజుకు ప్రాణహాని ఉంది
ఇప్పటికే ఆయన వాంగ్మూలం ఇచ్చారు
ఇక కస్టడీ అవసరం లేదు
ఒకవేళ ఇస్తే రెండ్రోజులు చాలు
కోర్టుకు నాగరాజు తరఫు న్యాయవాదుల వినతి
అరెస్టు సమయంలోనే అన్నీ చెప్పాను
వీడియోకాల్‌లో సీఐ వెల్లడి
ఆయనకు చట్టంపై అవగాహన ఉంది
కనీసం 5 రోజులైనా కస్టడీకి ఇవ్వండి
పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి అభ్యర్థన
విచారణ నేటికి వాయిదా
విజయవాడ, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ‘రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి సీఐ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు సిట్ అధికారులకు చెప్పాల్సిందంతా చెప్పారు. చెప్పడానికి కొత్త విషయాలేమీ లేవు. ఆయనకు ప్రాణహాని ఉంది. నాగరాజును వేధించి సంబంధం లేని విషయాలను అంగీకరింపజేసేందుకే సిట్ అధికారులు 12 రోజులపాటు కస్టడీకి కోరారు’ అని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న నాగరాజును 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. నాగరాజు తరపున సీనియర్ న్యాయవాది దిట్టకవి రామచంద్రరావు, జి.సాంబశివరావు వాదనలు వినిపించారు. అరెస్టు చేసినప్పుడు జరిపిన విచారణలో నాగరాజు అన్ని వివరాలనూ సిట్ అధికారులకు వెల్లడించారని.. ఆయన్ను మానసికంగా వేధించడానికే కస్టడీ కోరుతున్నారని తెలిపారు.
‘ పగలూ రాత్రీ వరుసగా ప్రశ్నించి ఆయనకు నిద్ర లేకుండా చేసి వేధిస్తారు. ఈ కేసులో సిట్ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవు. కొంతమంది వాంగ్మూలాల ఆధారంగా అరెస్టు చేశారు. ఈ కేసులో నాగరాజును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలని న్యాయస్థానం భావిస్తే రెండ్రోజులపాటే అనుమతించాలి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారించాలి. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసి దాన్ని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలి’ అని కోరారు. ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు ప్రాణహాని ఉందని మరో న్యాయవాది జి.సాంబశివరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారించేలా సిట్‌కు ఆదేశాలివ్వాలని కోరారు. జైలు నుంచి విజయవాడకు తీసుకొస్తే నాగరాజు ప్రాణాలకు భద్రత ఉంటుందని సిట్ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేయాలన్నారు. సిట్‌కు అసలు కార్యాలయమే లేదని.. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నాగరాజును ఎక్కడ విచారిస్తారని ప్రశ్నించారు. సిట్‌లో ఉన్న అధికారులంతా కాకుండా కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి మాత్రమే నాగరాజును ప్రశ్నించాలని కోరారు.
ఆయనకు చట్టం బాగా తెలుసు
నాగరాజుకు చట్టంపై మంచి అవగాహన ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి తెలిపారు. ఆయన సాధారణ వ్యక్తి కాదని, ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారని.. ఎంతోమంది నిందితులను ఆయన విధుల్లో ఉన్నప్పుడు విచారించారని అన్నారు. సాయికృష్ణ ఏమయ్యాడో ఇప్పటికీ తెలియలేదని, చనిపోయి ఉంటే బూడిదను అయినా రికవరీ చేయాలని కోర్టుకు వివరించారు. ఇలాంటి ఘటనే కేరళలోనూ జరిగిందని, అక్కడ మృతదేహం లభించిందని తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వారిని కస్టడీకి తీసుకుని ఏ దర్యాప్తు అధికారీ చిత్రహింసలు పెట్టరని తెలిపారు. నాగరాజు నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలంటే కనీసం ఐదు రోజులైనా కస్టడీకి అనుమతించాలన్నారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతిస్తారని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగ్ చేయడం సాధ్యం కాదన్నారు.
సిట్ న్యాయ సలహాదారుగా బైరా రామకోటేశ్వరరావు
సాయికృష్ణ కేసులో సిట్‌కు న్యాయ సలహాదారుగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావును ప్రభుత్వం సోమవారం నియమించింది. ఈ మేరకు జీవో 823 విడుదల చేసింది. దర్యాప్తులో చట్టపరమైన సలహాలు అందించడం, సాక్ష్యాధారాలను పరిశీలించడం, దర్యాప్తు నివేదికలను వెట్టింగ్ చేయడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహిస్తారు.
నాకు సంబంధం లేదు: నాగరాజు
సాయికృష్ణ అదృశ్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇన్‌స్పెక్టర్ నాగరాజు న్యాయాధికారి శ్రీకాంత్‌కు తెలిపారు. కస్టడీ పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతుండగా.. రాజమండ్రి జైలులో ఉన్న నాగరాజు వాదనలు వినడానికి ఆయనకు ఫోన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జైలు సూపరింటెండెంట్ ఫోన్ నుంచి వీడియోకాల్ ద్వారా నాగరాజు మాట్లాడారు. సిట్ అధికారులు 12 రోజులపాటు కస్టడీకి అడిగారని, ఇందులో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని న్యాయాధికారి శ్రీకాంత్ ఆయన్ను ప్రశ్నించారు. నాగరాజు సమాధానమిస్తూ సాయికృష్ణ అదృశ్యం కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. సిట్ అధికారులు కేవలం తనను వేధించి.. చేయని నేరాన్ని అంగీకరించేలా చేయడానికే కస్టడీ కోరుతున్నారని తెలిపారు. అరెస్టు సమయంలో చేసిన విచారణలోనే అన్ని విషయాలనూ సిట్‌కు వివరించానని తెలిపారు. ఈ వివరాలను మెమో రూపంలో కోర్టుకు మెయిల్ ద్వారా పంపాలని న్యాయాధికారి ఆదేశించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.