Share News

నలుగురు మావోయిస్టులకు బెయిల్‌

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:42 AM

గతేడాది విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేసిన నలుగురు మావోయిస్టులకు కృష్ణా జిల్లా ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది.

నలుగురు మావోయిస్టులకు బెయిల్‌

  • అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లరాదని షరతు

విజయవాడ, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): గతేడాది విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేసిన నలుగురు మావోయిస్టులకు కృష్ణా జిల్లా ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ లోని సుక్మా జిల్లా పోలంపల్లి గ్రామానికి చెందిన పొడియ రెంగు, జేగురుగొండ గ్రామానికి చెందిన మడకం మదన్‌, బీజాపూర్‌ జిల్లా ఉరైపాల్‌ గ్రామానికి చెందిన సోది మనీలా, సుక్మా జిల్లా పుట్టేపాడ్‌ గ్రామానికి చెందిన సోది మంగిలను గడచిన ఏడాది నవంబరులో పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురిలో ఇద్దరు నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ నలుగురికి బెయిలు ఇవ్వాలని వారి తరఫున పిచ్చుక శ్రీనివాసరావు మచిలీపట్నంలోని ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదప్రతివాదనలు ముగియడంతో న్యాయాధికారి జి.గోపి బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు. నలుగురు నిందితులూ రూ.25 వేల చొప్పున రెండేసి పూచీకత్తులను సమర్పించాలని, పోలీసులు, కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లరాదని షరతులు విధించారు.

Updated Date - Jun 13 , 2026 | 04:43 AM