Share News

Book Festival: పుస్తక పండగ ఆరంభం

ABN , Publish Date - Jan 03 , 2026 | 05:32 AM

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శుక్రవారం 36వ పుస్తక మహోత్సవం ఘనంగా మొదలైంది.

Book Festival: పుస్తక పండగ ఆరంభం

  • స్టాళ్లలో పరుచుకున్న లక్షల అక్షర సుమాలు

  • బెజవాడలో 10 రోజులు సాగనున్న సంరంభం

  • పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు

  • మనతో పాటు అవీ ప్రయాణిస్తాయి

  • తీర్పు ఇచ్చేటప్పుడు రాజ్యాంగం తిరగేస్తే అందులోని అక్షరాలు హాయిని కలిగిస్తాయి

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహ

విజయవాడ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శుక్రవారం 36వ పుస్తక మహోత్సవం ఘనంగా మొదలైంది. ఆంధ్రులకు ఉన్న ముఖ్యమైన పండగల్లో ఒకటిగా మారిన పుస్తకాల పండగ రానున్న పది రోజుల వరకు సాహిత్యకారులను, భాషాభిమానులను అలరించనుంది. తెలుగు నుడికారానికి వన్నెలు దిద్దే పుస్తకాల మొదలు వినోదం, విజ్ఞానం అందించే గ్రంఽథాల వరకు స్టాళ్లలో కొలువు తీరాయి. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, సాహిత్య ప్రధాన వేదికకు డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌, ప్రతిభా వేదికకు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్‌ నార్లీకర్‌ పేర్లను పెట్టారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘నా దృష్టిలో పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు. మనతోపాటు అవీ ప్రయాణం చేస్తుంటాయి’’ అని ఆయన తెలిపారు. తెలుగు భాషతో మనకు బాంధవ్యం ఉన్నదని తెలిపారు. ‘‘భాషను పరిరక్షించుకోవడానికి మనకు రెండు తరాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు లాటిన్‌ జాబితాలో చేరిపోయే ప్రమాదం ఉంది.’’ అని తెలిపారు. భాషను సజీవంగా ఉంచడానికి పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. ‘‘చాలామంది పిల్లల్లా నేను కూడా కాన్వెంట్‌లో చదివాను. ఉత్తరాలు తెలుగులో రాస్తే టీచర్లు కొట్టేవారు. నేను ఇంగ్లీష్ లో రాసిన లేఖలకు మా నాన్న తెలుగులోనే ప్రత్యుత్తరం ఇచ్చేవారు. ఆ తర్వాత తెలుగు భాష నేర్చుకుని రామాయణం, భాగవతం చదివాను. తీర్పులు ఇచ్చేటప్పుడు రాజ్యాంగం తిరిగేస్తే, అందులోని అక్షరాలు పులకింపజేస్తాయి.’’ అని జస్టిస్‌ నరసింహ తెలిపారు.


ఏఐ యుగంలోనూ తగ్గని పుస్తక అభిరుచి : రఘురామ

విజయవాడ పుస్తక మహోత్సవానికి వచ్చే ఏడాది ఒక ప్రాంగణాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు అన్నారు. తెలుగు భాష పరిరక్షణపై సీఎంకు, పుస్తక పఠనంపై డిప్యూటీ సీఎంకు ఎంతో ఆసక్తి ఉందని చెప్పారు. వారితో సంప్రదించి అమరావతిలో సొంత ప్రాంగణం కేటాయించడానికి ప్రయత్నం చేస్తానన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన 36వ పుస్తక మహోత్సవంలో రఘువీరా ప్రసంగించారు. పది ఎకరాలు కాకపోయినా ఐదు ఎకరాల స్థలం కేటాయించినా అద్భుతమైన పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘డిజిటల్‌ యుగంలో పుస్తక పఠనం తగ్గిపోతుందని అందరితోపాటు నేనూ భావించాను. అయితే, సామాజిక మాధ్యమాలు ఎంతలా అభివృద్ధి చెందినా పుస్తకపఠనం ఏమాత్రం తగ్గలేదు’’ అని తెలిపారు. రాష్ట్రంలో ఒకప్పుడు గ్రంథాలయాలకు ఎంతో వైభవం ఉండేదని, ఇప్పుడు పుస్తకాలు లేని అచేతన స్థితిలో అవి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే తెలుగును మరచిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సహకరించినా, సహకరించకపోయినా భాషాభిమానులంతా ఏకతాటి పైకి వచ్చి మాతృభాషను, పుస్తకాలను సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. పుస్తక పఠనంపై రోజురోజుకు అభిమానం పెరుగుతోందన్నారు. విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఢిల్లీ ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఎ.కృష్ణారావు మాట్లాడుతూ... మార్క్స్‌ కాపిటల్‌, పోతన భాగవతం వంటి వంద పుస్తకాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం పుస్తకం కాదని, అదొక వ్యవస్థ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 03 , 2026 | 05:33 AM