విజయవాడ-బెంగళూరు వందేభారత్ నడపాలి
ABN , Publish Date - May 12 , 2026 | 05:23 AM
విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు నడపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సోమవారం ఆయన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి మూడు కీలక ప్రతిపాదనలు చేశారు.
అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ లావు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మే 11(ఆంధ్రజ్యోతి): విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు నడపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సోమవారం ఆయన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. ‘విజయవాడ నుంచి వేలాది మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు నిత్యం బెంగళూరుకు ప్రయాణిస్తుంటారు. విజయవాడ-బెంగళూరు మధ్య ప్రస్తుతం పరిమిత రవాణా సౌకర్యాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాల మధ్య తక్షణమే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభించాలి. పల్నాడు ప్రాంతంలోని సిమెంట్, సున్నపురాయి, వ్యవసాయ మరియు లాజిస్టిక్స్ రంగాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే పోర్టుతో అనుసంధానం ముఖ్యం. అందుకే పిడుగురాళ్ల జంక్షన్ నుంచి రామాయపట్నం పోర్టు వరకూ కొత్త రైల్వేలైన్ నిర్మించాలి. నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701), సికింద్రాబాద్-తిరుపతి, లింగంపల్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్(12796) రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలి’ అని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తాను చేసిన విన్నపాలపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.