ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:31 AM
ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని, విజయవాడను సినీ రాజధానిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
సినీ రాజధానిగా విజయవాడను తీర్చిదిద్దాలి
ఏపీ ఫిల్మ్ చాంబర్ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే గద్దె
విజయవాడ కల్చరల్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని, విజయవాడను సినీ రాజధానిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి (ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ ఇక్కడకు వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నిర్మాత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏఎం రత్నం మాట్లాడుతూ ఫిల్మ్ చాంబర్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్‌కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 100 ఎకరాలు కేటాయించి, ఫిల్మ్ సిటీ నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు. ఆ ఫిల్మ్ సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాలని సూచించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా మధుమోహన్‌కృష్ణ బాధ్యతలు స్వీకరించగా, ఉపాధ్యక్షులుగా సీవీఎస్ వర్మ, లక్ష్మీనరసింహం, ఏ.లోహిత్‌కుమార్, కార్యదర్శిగా మోహన్ గౌడ్, సంయుక్త కార్య దర్శులుగా వరప్రసాద్, ఎన్‌ఎస్ మూర్తి, ప్రసాద్‌రెడ్డి, కోశాధికారిగా కె.రవీంద్రనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎంఎస్ చౌదరి, ఎం.శ్రీనాథరావు, పీవీ రమణమూర్తి, పి.రమణారెడ్డి, అనగాని శ్రీనివాసరావు, యు.వెంకట్రావు, బాందేపురపు మూర్తి, డి.ప్రభాకర్‌రావు, రాజేశ్వరరావు, రామచంద్రరావు ఎన్నికయ్యారు. అనంతరం కార్యవర్గ సభ్యులను సత్కరించారు.