‘ఐఆర్‌ఆర్’ కేసు కొట్టేసిన ఏసీబీ కోర్టు
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:05 AM
రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌పై సీఐడీ నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది.
విజయవాడ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌పై సీఐడీ నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వైసీపీ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారని ఆరోపిస్తూ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసి.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నాటి మాజీ మంత్రులు లోకేశ్, పి. నారాయణతోపాటు పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసును దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు ‘మిస్టేట్ ఆఫ్ ది ఫ్యాక్ట్’గా నిర్ధారించామని పేర్కొంటూ ఆళ్లకు నోటీసులు ఇచ్చారు. అయితే, ఆయన ఎఫ్‌ఐఆర్, కోర్టుకు సమర్పించిన నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని కొట్టేస్తూ, సీఐడీ తుది దర్యాప్తు నివేదికను అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ఆళ్ల కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.