కోర్టు అడిగితే ‘యలహంక’ వివరాలు చెబుతా!
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:41 AM
జగన్, షర్మిల మధ్య జరుగుతున్న యలహంక ఆస్తుల వివాదం వారి వ్యక్తిగతమని పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్యక్షుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు.
ఆస్తుల గురించి నాకు, కేవీపీకే తెలుసు
జగనే కాంగ్రెస్‌కు వెన్నుపోటుదారు: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జగన్, షర్మిల మధ్య జరుగుతున్న యలహంక ఆస్తుల వివాదం వారి వ్యక్తిగతమని పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్యక్షుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. పూర్తి వివరాలు తనకు తెలిసినప్పటికీ బయట మాట్లాడడం కరెక్టు కాదని చెప్పారు. అయితే ఈ ఆస్తుల వివాదంలో కోర్టు గనుక తనకు సమన్లు పంపితే, తనకు తెలిసిన విషయాలను న్యాయస్థానం ముందు తప్పక చెబుతానని స్పష్టం చేశారు. గతంలో వారి కుటుంబానికి ఆడిటర్‌గా పనిచేశానని, వైఎస్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విషయాలు తనకు, కేవీపీ రామచంద్రరావుకు మాత్రమే తెలుసన్నారు. తనకైతే చెప్పే ఉద్దేశం లేదన్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డే అసలైన వెన్నుపోటుదారుడని ఆరోపించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తనను వెన్నుపోటుదారుగా పేర్కొంటూ జగన్ పార్టీ అండ్ కో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలనే తొందరలో.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రెండుసార్లు సీఎం పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే జగన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని నిరాకరించడంతోనే జగన్ కాంగ్రెస్‌ను వీడారని చెప్పారు. వైఎస్సార్‌సీపీలో తనను బలవంతంగా ప్రాంతీయ కోఆర్డినేటర్‌గా పరిమితం చేసి.. తన కింద పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించి, ఆయనకు రిపోర్ట్ చేయాలని చెప్పడం తనను అవమానించడమేనని అన్నారు. ఆత్మగౌరవం కోసమే బయటకు వచ్చానన్నారు.
డిసెంబరు 3న ఏపీలో కొత్త పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత పీఆర్‌పీలో చేరికలు ఎలా ఉంటాయో చూస్తారని అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు రాబోయే ఉగాది తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. తాను సీఎం అభ్యర్థిని కానని, ఎన్నికల్లో పోటీ చేయనని.. శివసేనకు బాల్ ఠాక్రే, బీఎస్పీకి కాన్షీరామ్ లాగా పార్టీని నిర్మించి మార్గనిర్దేశం చేస్తానని, 2029 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తామని చెప్పారు.