విజిలెన్స్ నివేదిక వస్తేనే.. ‘శ్రీవాణి’ నిధులకు మోక్షం
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:19 AM
శ్రీవాణి ట్రస్టు ద్వారా చేపట్టిన పనులకు నిధులు విడుదల చేసేందుకు విజిలెన్స్ నివేదిక అడ్డంకిగా మారింది.
తగిన ఆదేశాలు ఇవ్వండి: సీఎస్‌కు లేఖ రాసిన టీటీడీ
తిరుపతి(టీటీడీ), మార్చి 19(ఆంధ్రజ్యోతి): శ్రీవాణి ట్రస్టు ద్వారా చేపట్టిన పనులకు నిధులు విడుదల చేసేందుకు విజిలెన్స్ నివేదిక అడ్డంకిగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ట్రస్టు ద్వారా ఆలయాల ఎంపిక, చేపట్టిన పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు భావించిన కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 2024 ఆగస్టులో విచారణ చేపట్టగా, అప్పటి వరకు చేపట్టిన 89 పనులకు సంబంధించిన మొత్తం రూ.10.58 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే విజిలెన్స్ నివేదిక వస్తే తప్ప దీనిపై టీటీడీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. నిధులు విడుదల చేయాలని గుత్తేదారు ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విజిలెన్స్ నివేదికతో పాటు నిధుల విడుదలపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీటీడీ అధికారులు మరోమారు లేఖ రాశారు.