చీమకుర్తి క్వారీలపై విజి‘లెన్స్’!
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:33 AM
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో అక్రమాలపై గనులు, భూగర్భ శాఖ అధికారులు దృష్టిసారించారు.
ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ క్వారీలో విస్తృత సోదాలు
శాంభవీ గ్రానైట్స్ క్వారీలోనూ సోదాలు
ఒంగోలు, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో అక్రమాలపై గనులు, భూగర్భ శాఖ అధికారులు దృష్టిసారించారు. ప్రధానంగా జగన్ హయాంలో అడ్డగోలుగా తవ్వకాలు నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టినట్లు అనుమానాలు ఉన్న క్వారీల్లో తనిఖీలు ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎండీసీ భాగస్వామ్యంతో క్వారీలు నిర్వహించిన సంస్థలను తరిమికొట్టి.. అప్పటి వైసీపీ కీలక నేతలు వాటిని స్వాధీనం చేసుకుని భారీగా లబ్ధి పొందిన విషయం విదితమే. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మామ ప్రతా్‌పరెడ్డి నిర్వహిస్తున్న వీరభద్ర గ్రానైట్స్ క్వారీలో సోమవారం అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. ఇవి మరో రెండ్రోజులు కొనసాగే అవకాశం ఉంది. గనుల శాఖ భాగస్వామ్యంతో పల్లవి రెడ్ అనే క్వారీని లీజుకు తీసుకుని క్వారీయింగ్ చేస్తున్న పెరల్ సంస్థను వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే బయటకు పంపారు. అనంతరం జగన్ సమీప బంధువైన ఒకమాజీ ఎంపీ స్వాధీనం చేసుకుని.. బినామీలతో గెలాక్సీ రాళ్లు వెలికితీసి విక్రయించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే క్వారీయింగ్ నిలిపివేసి యంత్ర సామగ్రితో వెళ్లిపోయారు. గనుల శాఖ తిరిగి లీజుదారులను ఆహ్వానించగా పెరల్ సంస్థ పొందింది. పల్లవి రెడ్ నిర్వహించిన క్వారీలో శాంభవీ గ్రానైట్స్ పేరుతో క్వారీయింగ్ చేస్తున్నారు. గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు సోమవారం అందులో తనిఖీలు నిర్వహించారు. 2019 తర్వాత ఆ క్వారీలో జరిగిన గెలాక్సీరాయి వెలికితీత, క్రయవిక్రయాలు, డంపింగ్ నిర్వహణ తదితర అంశాలపై పూర్తి వివరాలివ్వాలని క్వారీ నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి క్వారీల్లో తనిఖీలు నిర్వహించి పలు అక్రమాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. వైసీపీ కీలక నేత బినామీలు నిర్వహించిన క్వారీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. సోమవారం తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు అనిత, ఆపర్ణ, రాఘవరావు, గనులు, భూగర్భ శాఖ అధికారులు అరవింద్, సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.