Share News

ఓఎన్‌జీసీకి టోకరాపై విజిలెన్స్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:18 AM

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)కు బెరైటీస్‌ సరఫరా పేరిట జరుగుతోన్న భారీ దోపిడీపై రాష్ట్ర సర్కారు స్పందించింది.

ఓఎన్‌జీసీకి టోకరాపై విజిలెన్స్‌

  • ఎండీసీ నుంచి ప్రైవేట్‌ కంపెనీలు కొనుగోలు చేసిన బెరైటీస్‌ ఎంత?

  • కేంద్ర సంస్థకు సరఫరా చేసిందెంత?

  • 2019 నుంచి 2025 వరకూ లెక్కలు తేల్చాలి

  • ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ

  • 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలి: సర్కారు ఆదేశం

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)కు బెరైటీస్‌ సరఫరా పేరిట జరుగుతోన్న భారీ దోపిడీపై రాష్ట్ర సర్కారు స్పందించింది. 2019-2025 మధ్యకాలంలో ఓన్‌జీసీకి బీ-గ్రేడ్‌ బెరైటీస్‌ను సరఫరా చేసిన ప్రైవేట్‌ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి ఎంత మొత్తంలో బీ-గ్రేడ్‌ (4.1రకం) బెరైటీస్‌ కొన్నాయి? కేంద్రసంస్థకు ఏ పౌడర్‌ సరఫరా చేశాయో నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌కుమార్‌ మీనా శుక్రవారం మెమో జారీ చేశారు. విచారణ కోసం ముగ్గురు సీనియర్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గనులశాఖ అదనపు డైరెక్టర్‌ డి. శ్రీనివాసరావు, ఏపీఎండీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌. కేధార్‌నాథ్‌ రెడ్డి, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వి. రవిచంద్‌ సభ్యులుగా ఉన్నారు. బెరైటీస్‌ గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే నివేదికను కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ)కి, ఓఎన్‌జీసీకి పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. బెరైటీస్‌ సరఫరాలో ఓఎన్‌జీసీకి ప్రైవేట్‌ కంపెనీలు టోకరా వేస్తున్నాయని పేర్కొంటూ ‘ఆంధ్రజ్యోతి’ గత ఏడాదిన్నరగా పలు కథనాలు ప్రచురించడం ద్వారా అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


బెరైటీస్‌ సరఫరాలో గోల్‌మాల్‌

నిబంధనల ప్రకారం ప్రతీ కంపెనీ లేదా మిల్లుకు నెలకు 140 టన్నుల బీ-గ్రేడ్‌ బెరైటీస్‌ను ఏపీఎండీసీ అమ్ముతుంది. ఇలా ఒక కంపెనీ సంవత్సరానికి కొనగలిగే సరుకు 1,680 టన్నులు మాత్రమే. కానీ ఓఎన్‌జీసీకి ఏటా లక్షన్నర టన్నుల మేర సరఫరా చేసే రూ.వందల కోట్ల విలువైన కాంట్రాక్టులను ప్రైవేట్‌ కంపెనీలు దక్కించుకుంటున్నాయి. అవి అంత సరుకును ఎలా సరఫరా చేస్తున్నాయి? దీని వెనుక ఏం జరుగుతోందని ఆనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర సంస్థ నుంచి కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు గత ఐదేళ్లలో ఎండీసీ నుంచి ఏ మేరకు ఏ, బి, సి, డీ, డబ్ల్యూ గ్రేడ్‌ బెరైటీస్‌ను కొన్నాయన్న లెక్కలను పరిశీలిస్తే, కొన్న సరుకు కంటే, వంద రెట్లు ఎక్కువగా ఓఎన్‌జీసీకి సరఫరా చేశాయన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి గతేడాది అందాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ గతేడాదే ‘ఓఎన్‌జీసీకి కంపెనీల టోకరా’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఆ తర్వాత ఈ అంశం గత నెలలో మరోసారి చర్చకొచ్చింది. 2026-28 సంవత్సరాలకు గాను ఓఎన్‌జీసీ 2.82 లక్షల టన్నుల బీ-గ్రేడ్‌ బెరైటీస్‌ సరఫరాకు టెండర్లు పిలిచింది. మళ్లీ పాత కంపెనీలే టెండర్‌ దక్కించుకున్నాయి. దీంతో భారీ గోల్‌మాల్‌ జరగబోతుందంటూ ‘మళ్లీ అదే దోపిడీ’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ వరస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ గతనెల 29న ప్రభుత్వానికి లేఖ రాసి, విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని కోరారు. మంగంపేట ప్రాంతంలోని అనేక మిల్లులు కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి, ఓన్‌జీసీకి లేఖలు రాశాయి. టెండర్‌ను ఖరారు చేసి, సరఫరా ఒప్పందం కుదుర్చుకొనే ముందే ఆయా కంపెనీల చరిత్ర, అర్హతలు, సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించాలని కోరాయి.


విజిలెన్స్‌ విచారణ చేపట్టాల్సిన అంశాలివీ...

  • ఓఎన్‌జీసీకి బీ-గ్రేడ్‌(4.10) బెరైటీస్‌ సరఫరా చేసేందుకు కాంట్రాక్టు దక్కించుకున్న సుహృత మినరల్స్‌, గౌసియా మినరల్‌ ట్రేడింగ్‌ కంపెనీ, అరుణాయ్‌ ప్రొడక్ట్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు 2019-2025 మధ్యకాలంలో ఏపీఎండీసీ నుంచి కొన్న ముగ్గురాయి ఎంత? ఓఎన్‌జీసీకి సరఫరా చేసింది ఎంత?

  • రైల్వేకోడూరులోని 7-637లో రిజిస్టర్‌ అడ్ర్‌సలో ఉన్న సుహృత మినరల్స్‌, అరుణాయ్‌ మినరల్స్‌ కంపెనీలను గతంలోనే ఏపీఎండీసీ బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఇప్పుడు ఓఎన్‌జీసీ టెండర్‌లో ఎల్‌1గా నిలిచిన సుహృత మినరల్స్‌, ఎల్‌3గా ఉన్న అరుణాయి మినరల్స్‌ బ్లాక్‌లిస్ట్‌‌లో ఉన్న కంపెనీలేనా? లేక వేరేవా? నిగ్గుతేల్చాలి. లేక అవే సంస్థలు కొత్త పేర్లతో టెండర్‌ దక్కించుకున్నాయా నిర్ధారించాలి.

  • 2026-28 ఓఎన్‌జీసీ బెరైటీస్‌ సరఫరా టెండర్‌ బిడ్డింగ్‌లో ముందువరసలో ఉన్న కంపెనీలకు ఏపీఎండీసీ ఇచ్చే 4.10 బెరైటీస్‌ ఎంత? ఆ కంపెనీల పూర్వ, ప్రస్తుత కొనుగోలు సామర్థ్యం ఎంత? గతంలో వాటిని ఏమైనా బ్లాక్‌లిస్టు చేశారా? చేస్తే వాటి చరిత్ర ఏమిటి? అసలు ఆ కంపెనీలు ఓఎన్‌జీసీకి సరఫరా చేసిన పౌడర్‌ ఏమిటి? అనే అంశాలను నిర్ధారించాలి. ఆ తర్వాత వాటిని ఓఎన్‌జీసీకి లిఖితపూర్వకంగా తెలియజేయాలి.

Updated Date - Jun 06 , 2026 | 05:18 AM