అడ్డగోలుగా నిధులు డ్రా చేస్తే వేటే
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:51 AM
గ్రామ పంచాయతీల ఖాతాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిఘా పెట్టింది.
పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశం
పంచాయతీల ఖాతాలపై నిఘా
4 రకాల పనులకే ఆర్థిక సంఘం నిధుల ఖర్చు
గ్రీన్ అంబాసిడర్ల జీతాలు, విద్యుత్ బిల్లులు పారిశుధ్యం, తాగునీటి పనులకే వాడాలని నిర్దేశం
మార్చిలో ముగియనున్న సర్పంచ్‌ల పదవీకాలం
ఎడాపెడా నిధులు డ్రా చేసేందుకు కొందరి ప్రయత్నాలు
వైసీపీ సర్పంచ్‌ల గోల్‌మాల్‌కు అడ్డుకట్ట
ప్రతిపైసా గ్రామాభివృద్ధికి, గ్రామీణ సౌకర్యాలకు అందేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం
సాధారణ నిధులపైనా నిఘా
రాష్ట్రంలో వందకు పైగా గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంఘం నిధుల కంటే రాబడి ఎక్కువగా ఉంది. ఈ సాధారణ నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తుండటంతో పంచాయతీరాజ్ శాఖ దానిపై కూడా నిఘా పెట్టింది. బ్లీచింగ్, విద్యుత్ దీపాలు, ఇతర మెటీరియల్ కొనుగోలు విషయంలో పలు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఆడిట్ విషయంలో కూడా పంచాయతీలపై నిఘా పెట్టనుంది. మొక్కుబడిగా పంచాయతీల ఆడిట్ జరుగుతుండటంతో నిధుల వినియోగంపై చిత్తశుద్ధి లేకుండా పోయిందని అధికారులు గుర్తించారు. ఇక నుంచి ఆడిట్ విషయంలో నిఘా పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది.
అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల ఖాతాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిఘా పెట్టింది. మార్చి నెలాఖరుకు సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండటంతో 15వ ఆర్థిక సంఘం నిధులను అడ్డగోలుగా విడుదల చేయకుండా అధికారులు తాళం బిగించారు. నాలుగు రకాల పనులను మాత్రమే ఈ నిధులతో చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఏ పంచాయతీలోనైనా నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేస్తే ఆ పంచాయతీ కార్యదర్శికి శంకరగిరిమాన్యాలేనని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఖాతాల పట్ల అలర్ట్ పెరిగింది. గ్రీన్ అంబాసిడర్ల జీతాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, పారిశుధ్యం, అత్యవసర తాగునీటి పనులకే 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
పంచాయతీ కార్యదర్శులు ఈ నిధుల వాడకంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు సూచించారు. గ్రామ పంచాయతీల్లో ప్రతిపైసా గ్రామాభివృద్ధికి, గ్రామీణ సౌకర్యాలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 10 వేలమంది పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదే రీతిలో వారి నుంచి పారదర్శక పాలన ఆశిస్తోంది. వివిధ దశల్లో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులపై నిఘా పెట్టింది. ఎక్కడైనా ఉద్యోగులు గాడి తప్పితే వారిపై వేటుకు ఉపక్రమిస్తోంది. గతంలో ఓసారి స్వర్ణ పంచాయతీలకు సంబంధించి ఆస్తుల అసెస్‌మెంట్‌పై తప్పుడు ఫోన్ నంబర్లు లింక్ చేసినందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సీరియస్ అయ్యారు. ప్రతి జిల్లా నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు.
టీడీపీ కేడర్ అప్రమత్తం
వైసీపీ హయాంలో నిర్వహించిన సర్పంచ్‌ల ఎన్నికల్లో ఎక్కువ మంది ఆ పార్టీకి చెందినవారే ఎన్నికయ్యారు. గ్రామాల్లో వారి పాలన పట్ల ఇప్పటికే టీడీపీ కేడర్ నిఘా వేసి అప్రమత్తంగా ఉంది. గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగిన చోట్ల అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పలు జిల్లాల్లో పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం పట్ల విచారణలు అధికమయ్యాయి. మార్చి నెలాఖరులోపు పంచాయతీల్లో ఉన్న నిధులను ఎలాగైనా వ్యయం చేసినట్లు చూపించి రికార్డులు సృష్టించే పనిలో సర్పంచ్‌లు ఉండగా.. టీడీపీ కార్యకర్తల ఫిర్యాదులతో పంచాయతీ కార్యదర్శులు అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల టీడీపీకి సానుభూతిపరులుగా మారిపోయిన సర్పంచ్‌లు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారు. దీంతో పలు పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపడింది. వైసీపీ సర్పంచ్‌లు కొందరు పారిశుధ్యం పనులకు నిధులు ఖర్చు చేయడం పట్ల విముఖత వ్యక్తం చేయడంతో పంచాయతీ కార్యదర్శులే చొరవ తీసుకుని పారిశుధ్యానికి నిధులు వాడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న కార్యదర్శులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఆఖరి రోజుల్లో పంచాయతీ నిధుల వ్యయంలో తేడాలొస్తే రిటైర్మెంట్ తర్వాత విచారణలు ఎదుర్కొవాల్సి వస్తుందని జాగ్రత్త పడుతున్నారు. అయితే కొంతమంది కార్యదర్శులు బరితెగించి పంచాయతీ ఖాతాల్లో నిధులను సర్పంచ్‌లతో కలిసి పంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో పాత పనులకు సంబంధించినవాటికి ఎంబుక్‌లను చేసి ఇప్పుడు చెల్లింపులు చేయాలంటూ ముందుకు తీసుకొస్తున్నారు. తాగునీటి పనులకు సంబంధించి ఆర్థిక సంఘం నిధులు వాడుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ స్పష్టత ఇచ్చింది. దీంతో కొంత మంది సర్పంచ్‌లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలతో కుమ్మక్కై మోటార్లు కాలిపోకుండానే కాలిపోయినట్లు బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై కచ్చితమైన నిఘా లేకపోవడంతో నీటి సమస్యల పేరుతో నిధులను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.