పెద్దిరెడ్డి సంస్థపై విజిలెన్స్ దృష్టి!
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:11 AM
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ సంస్థ చేపట్టిన పనులపై విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది.
పని చేయకుండానే సొమ్ము స్వాహా
చేసిన పనుల్లోనూ నాణ్యతా లోపం
దెబ్బతిన్న గ్రామీణ రహదారులు
చిత్తూరు జిల్లాలో రూ.490 కోట్ల
ఏపీఆర్‌ఆర్‌పీ పనులపై విచారణ
టెండర్ ప్రక్రియపైనా అనుమానం
కాంట్రాక్టర్లను బెదిరించారనే ఆరోపణలు
నేడు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన
తిరుపతి(టీటీడీ), జూన్ 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ సంస్థ చేపట్టిన పనులపై విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. పనులు చేపట్టకుండానే నిధులు కాజేశారని, చేపట్టిన కొద్దిపాటి పనులూ నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్(ఏఐఐబీ) ఆర్థిక సహాయంతో రాష్ట్ర గ్రామీణ రోడ్ల(ఏపీఆర్‌ఆర్‌పీ) పనులను చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో రూ.490 కోట్ల విలువైన పనులు పీఎల్‌ఆర్ సంస్థ చేసింది. అయితే.. వీటిలో కొన్ని పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారని.. చేపట్టిన కొద్దిపాటి పనులు కూడా నాసిరకంగానే ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ రంగంలోకి దిగింది.
ఆది నుంచి అన్నీ...
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పీఎల్‌ఆర్ సంస్థ చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్టు వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. టెండరు ప్రక్రియ ఎలా చేపట్టారు?. ఆయా పనులకు సంబంధించిన టెండర్లు ఎప్పుడు పిలిచారు?. అనే వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈఎన్‌సీ నుంచి వివరాలు కోరారు. ఆ వివరాలు వచ్చిన వెంటనే టెండరు ప్రక్రియను సజావుగా చేశారా లేదా అనే అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఆయా పనుల కోసం ఎంతమంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు?. ఏయే సంస్థలు పాల్గొన్నాయి? ఒకే సంస్థ పాల్గొన్నా పనులు ఇచ్చారా?. అనే సమాచారం వెలికి తీస్తున్నారు. అలాగే ఆయా పనులకు ఎంత మేరకు అదనపు చెల్లింపులు చేశారన్న వివరాలు సైతం సేకరిస్తున్నారు. అంతేకాదు, పూర్తయిన 350 పనులను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. టెండరు నిబంధనల మేరకు కాంక్రీటు పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేశారా? లేదా? అనే అంశాలను చూడనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు.
అన్ని పనులూ ఆ సంస్థకే
వైసీపీ హయాంలో రహదారి ప్రాజెక్టు పనులు దాదాపు అప్పటి మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ సంస్థే దక్కించుకుంటూ వచ్చింది. కాంట్రాక్టర్లను నయానో భయానో టెండర్లు దాఖలు చేయకుండా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకసారి టెండర్లు దక్కించుకున్న తర్వాత మళ్లీ వాటిని సబ్‌లీజుకు ఇచ్చేవారు. కొన్ని పనులను పీఎల్‌ఆర్ సంస్థ స్వయంగా చేపట్టింది. ఏపీఆర్‌ఆర్‌పీ కింద 21 ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టగా.. వీటిలో పీఎల్‌ఆర్ సంస్థ రూ.490 కోట్ల విలువైన పది ప్యాకేజీ పనులు(550) దక్కించుకుంది. అధికారులకు వచ్చిన సమాచారం మేరకు 350 పను లు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారులను అనుసంధానం చేసేందుకు ఈ పనులు చేపట్టారు. బీటీ, సిమెంటు కాంక్రీటు రహదారులు, అవసరమైన బ్రిడ్జిలు, క్రాస్ డ్రెయి న్ల పనులు చేశారు. వీటిలో పెద్ద ఎత్తు న అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు దృష్టిసారించారు.