Share News

ముడుపుల కోసం ‘మలుపులు’

ABN , Publish Date - Jun 27 , 2026 | 04:12 AM

అభివృద్ధి పనుల కోసమంటూ పేదల ఇళ్లను తొలగించి.. స్థలాలను తీసేసుకుని పనులు చేపట్టే అధికారులు.. వైసీపీ హయాంలో పెద్దలకు మాత్రం ఎర్ర తివాచీ పరిచారు.

ముడుపుల కోసం ‘మలుపులు’

  • అలైన్‌మెంట్‌తో వైసీపీ ఆటలు.. తిరుపతి రోడ్లలో భూమన ‘మాస్టర్‌ ప్లాన్‌’

  • అలైన్‌మెంట్‌లో భూములు పోయే పెద్దలకు అండగా రంగంలోకి.. రూ.2 కోట్ల ముడుపులు వసూలు!

  • సరళరేఖగా ప్రతిపాదించిన రోడ్డును ఎటుపడితే అటు తిప్పిన వైనం

  • నాటి డిప్యూటీ మేయర్‌, కొడుకు అభినయ్‌ పదవిని అడ్డంపెట్టి ఇష్టారాజ్యం

  • విజిలెన్స్‌ విచారణలో వెలుగులోకి..

భివృద్ధి పనుల కోసమంటూ పేదల ఇళ్లను తొలగించి.. స్థలాలను తీసేసుకుని పనులు చేపట్టే అధికారులు.. వైసీపీ హయాంలో పెద్దలకు మాత్రం ఎర్ర తివాచీ పరిచారు. కొందరు పెద్దల కోసం తిరుపతి కార్పొరేషన్‌లో మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అలైన్‌మెంటును ఎటుపడితే అటు మార్చేశారు. ఇష్టానుసారం టీడీఆర్‌ బాండ్లను జారీచేసి రూ.కోట్లలో లాభపడ్డారు. మొత్తం వ్యవహారంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి భారీగా లబ్ధి పొందారని విజిలెన్స్‌ విచారణలో తేలింది. దీనికోసం ఆయన తన కుమారుడు, అప్పటి డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌ పదవిని వాడుకున్నారని విజిలెన్స్‌ అధికారులు తేల్చారు. సుమారు రూ.2 కోట్ల ముడుపులు చేతులు మారినట్టు నిర్ధారించారు. విజిలెన్స్‌ వర్గాల కథనం ప్రకారం, తిరుపతి పరిసరాల్లో ఆరు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను అభివృద్ధి చేయాలంటూ కార్పొరేషన్‌ కమిషనర్‌కు 2022 జూలైలో ఒకటో డివిజన్‌ కార్పొరేటర్‌ రాధాకృష్ణారెడ్డి, అప్పటి డిప్యూటీ మేయర్‌ అభినయ్‌ ప్రతిపాదించారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లలో కరకంబాడి రోడ్డు నుంచి తిమ్మినాయుడుపాలెం, కొంకాచెన్నాయగుంట మీదుగా మిట్టూరు గ్రామం ద్వారా కాటన్‌ మిల్లు వరకు ప్రతిపాదించిన రోడ్డు సైతం ఉంది.


ఈ రోడ్డు ప్రతిపాదనకు 2022 జూలై 15న కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. దీని పరిధిలోని తిమ్మినాయుడుపాలెంలోని సర్వే నంబర్లు 272, 275 పరిధిలో వజ్ర అపార్ట్‌మెంట్‌, వింటేజ్‌ హైట్స్‌ అపార్ట్‌మెంట్‌ ఉన్నాయి. రూబీ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి ఎం. విహిత వజ్ర అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి సంబంధించి బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతి కోసం 2022 జనవరి 7న దరఖాస్తు చేశారు. అదే ఏడాది మార్చి 26న భవన నిర్మాణ అనుమతులు పొందారు. బిల్డర్‌ సమర్పించిన సైట్‌ ప్లాన్‌, లొకేషన్‌ ప్లాన్‌, లేఅవుట్‌ ప్లాన్‌ ప్రకారం... నిర్మాణ స్థలానికి తూర్పు వైపున 80 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు ప్రతిపాదించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు ప్రతిపాదిత నిర్మాణ స్థలానికి ముందు, తర్వాత కూడా ఒకే సరళరేఖలా (స్ర్టెయిట్‌ లైన్‌) సాగుతుంది. అంటే.. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు పనులు ఇక్కడ మొదలైతే వజ్ర అపార్టుమెంట్‌, దాని చుట్టూ పక్కల నివాసాలు, స్థలాలు ప్రభావితం అవుతాయన్నమాట. విస్తరణ పనుల వల్ల నష్టపోయే భూ యజమానులకు నగదు రూపంలో కాకుండా, టీడీఆర్‌ బాండ్ల జారీద్వారా నష్టపరిహారం అందించాలని నిర్ణయించారు. ఈ రోడ్డుకు గోదాదేవి (ఆండాళ్‌) మార్గంగా పేరు పెట్టారు. అభ్యంతరాలు తెలిపేందుకు పత్రికల ద్వారా నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఏమయిందో.. మరో నోటిఫికేషన్‌ 2023 ఆగస్టులో ఇచ్చారు. రోడ్డు విస్తరణ వల్ల నష్టపోయే సర్వే నంబర్లకు కొన్ని చిన్నచిన్న మార్పుచేర్పులను ఆ రెండో నోటిఫికేషన్‌లో సూచించారు. కానీ ఆ విషయం నోట్‌ఫైల్‌లోగానీ, కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాల్లోగానీ ఎక్కడా ప్రస్తావించలేదు.


తొలి నోటిఫికేషన్‌ రాగానే..

తొలి నోటిఫికేషన్‌ను పత్రికల్లో చూడగానే.. వజ్ర అపార్టుమెంటు, ఇతర నివాసాలు, భూముల యజమానులు భూమన కరుణాకరరెడ్డిని ఆశ్రయించారు. వారి నుంచి భూమన భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారు. తర్వాత తన అంగబలాన్ని, డిప్యూటీ మేయర్‌గా ఉన్న తన కుమారుడు భూమన అభినయ్‌ పదవిని వాడుకుని కార్పొరేషన్‌ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో మొదట ప్రతిపాదించిన అలైన్‌మెంటు మారిపోయింది. ఆ మార్పులతో రెండో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దాని ప్రకారమే పనులు మొదలుపెట్టారు.

ఉత్తర్వులకు భిన్నంగా...

తొలి నోటిఫికేషన్‌ ప్రకారం, కరకంబాడి రోడ్డు నుంచి మిట్టూరు వరకు రహదారిని 2 కిమీ సరళరేఖగా ప్రతిపాదించారు. చివరకు వచ్చేసరికి అడ్డదిడ్డంగా మార్చేశారు. కరకంబాడి రోడ్డు నుంచి 365 మీటర్ల వరకు మాత్రమే సరళరేఖలో రోడ్డు నిర్మించారు. తర్వాత ఎడమ మలుపు తీసుకునేలా ప్రతిపాదించారు. తిమ్మినాయుడుపాలెంలోని సర్వే నంబర్లు 272, 275 పరిధిలో ప్రతిపాదించిన 80 అడుగుల రోడ్డుకు విరుద్ధంగా ప్రస్తుతం అక్కడ 70 నుంచి 75 అడుగుల మధ్య రకరకాల వెడల్పులతో నిర్మించారు. కరకంబాడి రోడ్డు నుంచి 365 మీటర్ల దూరం వద్ద ఈ రోడ్డు ‘వజ్ర బై హేయాంశ్‌ ఇన్‌ఫ్రా’, ‘వింటేజ్‌ హైట్స్‌’ అపార్ట్‌మెంట్లను నిలువుగా తాకుతుంది. ఇక్కడ ప్రతిపాదిత 80 అడుగుల రోడ్డు కాస్తా 50 అడుగులకు తగ్గిపోయింది. ఈ రెండు అపార్ట్‌మెంట్లు దాటిన వెంటనే రోడ్డును ఒక పదునైన ఎడమ మలుపుతో నిర్మించారు. తర్వాత 170 మీటర్ల పొడవు వరకు వేర్వేరు వెడల్పులతో ( 0 నుంచి 60 అడుగుల వరకు మారే) ఒక పెద్ద డివైడర్‌ గ్యాప్‌ను వదులుతూ రెండు వన్‌వే రోడ్లుగా (30-35 అడుగుల వెడల్పుతో) రోడ్డును వేశారు. ఆ తర్వాత మళ్లీ అది నాలుగు వరుసల రోడ్డుగా కొనసాగింది.


చర్యలకు వెనకడుగు....

అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మార్చిన కార్పొరేషన్‌ అధికారులపై శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్‌ అధికారులు సిఫారసు చేశారు. అలాగే అక్కడ ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు రోడ్డు డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ను పునఃసమీక్షించాలని కోరారు. కానీ, మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో నిజాయితీగా పనిచేసే అధికారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు తెగబడ్డా కనీస క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే అవినీతి ఏ విధంగా అంతం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

-అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 27 , 2026 | 04:13 AM