Share News

వియత్నాం విషాదం..తీరని శోకం!

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:15 AM

వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలను మంగళవారం వారి స్వస్థలాలకు తరలించారు.

వియత్నాం విషాదం..తీరని శోకం!

  • స్వస్థలాలకు చేరిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలు

  • ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లలో తరలింపు

  • ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కొండపల్లి

అమరావతి/హిందూపురం/కడప క్రైం/మచిలీపట్నం టౌన్‌, జూలై 14(ఆంధ్రజ్యోతి): వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలను మంగళవారం వారి స్వస్థలాలకు తరలించారు. కడపకు చెందిన శ్రీధర్‌, మచిలీపట్నానికి చెందిన జయలక్ష్మి, హిందూపురానికి చెందిన రవితేజ భౌతికకాయాలు సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకోగా.. మంగళవారం ఉదయం 7.20 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం కార్గో విభాగానికి చేర్చారు. బాధిత బంధువులు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లలో స్వగ్రామాలకు తీసుకెళ్లి, అంత్యక్రియలు పూర్తి చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సోమవారం రాత్రి 8గంటలకే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, రాత్రంతా అక్కడే ఉన్నారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపించే వరకు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాఽధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. గత శనివారం వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసులు సహా 15 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. బాఽధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఆదేశాల మేరకు ఎంఎస్ఎంఈ, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి, ఏపీఎన్‌ఆర్టీఎస్‌ అధికారులు భారత ఎంబసీతో మాట్లాడుతూ.. ప్రమాదం నుంచి బయటపడిన వారిని, మరణించిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.


కలెక్టర్‌, ఎమ్మెల్యే మాధవి నివాళులు

కడపలోని ఓంశాంతి నగర్‌లో ఉన్న నివాసానికి తీసుకొచ్చిన ముడియం శ్రీధర్‌ మృతదేహానికి నివాళులర్పించేందుకు బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎమ్మెల్యే మాధవి, టీడీపీ జోన ల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు శ్రీధర్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

శవపేటిక దించిన మంత్రి కొల్లు

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం చేరుకున్న గెల్లి జయలక్ష్మి భౌతికకాయం ఉన్న బాక్స్‌ను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర ఇతరుల సాయంతో అంబులెన్స్‌ నుంచి కిందకు దించారు. శవపేటిక స్ర్కూలను కూడా మంత్రి విప్పారు. అనంతరం మంత్రితో పాటు కలెక్టర్‌ బాలాజీ తదితరులు జయలక్ష్మి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం బంధువులు బందరు శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి వచ్చిన జయలక్ష్మి భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


బొమ్మ గీశా.. ఒక్కసారి లే నాన్నా..!

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన రవితేజ మృతదేహం ఇంటి వద్దకు రాగానే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు బోరున విలపించారు. ‘సెల్‌ఫోన్‌ కంపెనీ వాళ్లు ఎన్నిసార్లు విదేశీ టూర్‌కు అడిగినా వెళ్లలేదు. ఈసారి పాస్‌పోర్ట్‌ గడువు ముగిసినా తత్కాల్‌ కింద తీసుకుని వెళ్లారు. ఈసారి కూడా వెళ్లకుండా ఉంటే బతికేవాడివి కదా?’ అంటూ రవితేజ భార్య వేద కన్నీరుమున్నీరుగా విలపించారు. రవితేజ పెద్ద కూతురు సహస్ర తన తండ్రి విహారయాత్రకు వెళ్లి తిరిగొచ్చేసరికి, ఒక బొమ్మ గీసి కానుకగా ఇవ్వాలని అనుకుంది. తాను అందంగా చిత్రించిన బొమ్మకు ఫ్రేమ్‌ కట్టించి సిద్ధం చేసింది. అయితే ఆ బొమ్మను బహుమతిగా ఇచ్చేందుకు తన తండ్రి ఇక లేడని తెలుసుకున్న ఆ చిన్నారి.. ఆ బొమ్మను తండ్రి మృతదేహంపై పెట్టి కన్నీరుమున్నీరైంది. ‘నాన్నా.. నీ కోసమే ఈ బొమ్మ గీశాను. ఒక్కసారి లేచిచూడు నాన్నా..’ అని ఆ చిన్నారి విలపించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.

Updated Date - Jul 15 , 2026 | 05:17 AM