ఉద్యోగుల సంక్షేమమే శ్వాస
ABN , Publish Date - Feb 09 , 2026 | 04:28 AM
ఉద్యోగుల సంక్షేమమే తన శ్వాస అని ఏపీ ఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు.
వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం
ఏపీ ఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడు విద్యాసాగర్
ప్రధాన కార్యదర్శిగా డీవీ రమణ ప్రమాణం
విజయవాడ (గాంధీనగర్), ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సంక్షేమమే తన శ్వాస అని ఏపీ ఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిబద్ధతతో పని చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా విద్యాసాగర్, డీవీ రమణ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. తొలుత విజయవాడ పాత బస్టాండ్ నుంచి వందలాది మంది ఉద్యోగులతో భారీ ర్యాలీగా వచ్చి గాంధీనగర్‌లోని ఎన్జీవో హోంలో ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో విద్యాసాగర్ ప్యానల్ ఏకగీవ్రమైనట్టు ఎన్నికల అధికారి పురుషోత్తం నాయుడు ప్రకటించారు. అనంతరం స్థానిక జింఖాన గ్రౌండ్స్‌లో నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ, 75ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల సాధనలో ఎన్జీవో అనుసరిస్తున్న విధానాలతోనే సంఘం ఇప్పటికీ బలంగా పని చేస్తోందని తెలిపారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యవర్గం పని చేస్తుందన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగుల కీలక సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, ఔట్‌సోర్స్గింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేసేది లేదని, అవసరమైతే పోరాటాలకు సిద్ధపడే ఏకైక సంఘం ఎన్జీవో సంఘం మాత్రమేనని విద్యాసాగర్ స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో ఏళ్లుగా అపరిషృతంగా ఉన్న ప్రధాన సమస్యలను గత రెండేళ్లలో ఉద్యోగులు ఆశించిన స్థాయిలో పరిష్కరించామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి పనితీరును ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని జిల్లాస్థాయి నేతలకు సూచించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా వి.దస్తగిరి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జగదీశ్వరరావు, కోశాధికారిగా భారతీ ప్రసాద్, పలువురు ఉపాధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సంఘ పూర్వ నేతలు తదితరులు అభినందిం చారు. ఈ కార్యక్రమంలో భారీసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.