Share News

‘వయస్సు’పై తొందరపాటు

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:52 AM

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు అంశం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. 62 సంవత్సరాలను పదవీ విరమణ వయస్సుగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

‘వయస్సు’పై తొందరపాటు

  • రంగా యూనివర్సిటీ వీసీ తీరు వివాదాస్పదం

  • 62 ఏళ్లకు పదవీ విరమణ పెంపుపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ

  • అయినా, ‘65 ఏళ్లు’ గీటురాయిగా పోస్టింగ్‌లు ఇస్తూ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆదేశాలు

  • ప్రభుత్వ అనుమతులు రాకముందే సొంత నిర్ణయం

(గుంటూరు సిటీ, ఆంధ్రజ్యోతి)

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు అంశం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. 62 సంవత్సరాలను పదవీ విరమణ వయస్సుగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరుగుతుండగానే, 65 సంవత్సరాల ప్రాతిపదికన కొంతమంది రిటైర్డ్‌ ప్రొఫెసర్లకు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ శారదా జయలక్ష్మి తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ మేరకు గత శుక్రవారం వ్యవసాయ విశ్వ విద్యాలయం మెమో (నం.2312738/ఎస్‌ఈఆర్‌ శ్రీశ్రీ/ఏ 1/2026)జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... ఎన్‌జీ రంగా యూనివర్సిటీకి అనుబంఽధంగా ఉన్న వ్యవసాయ, ఉద్యానవన, పశు, మత్య్స విభాగాల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించిన లేఖను పరిశీలించే క్రమంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించకుండా లేఖ జారీ చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇతర విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ప్రొఫెసర్లకు ఇచ్చిన ప్రయోజనాలను రంగా వర్సిటీలోని నాలుగు అనుబంధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లకు ఎందుకు ఇవ్వకూడదన్న విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు ప్రశ్నించింది. దీనిపై స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ పరిణామాలతో వ్యవసాయ వర్సిటీలో పదవీ విరమణ వయస్సు అంశం ఇంకా తేలని స్థితిలోనే ఉంది.


వీసీ లేఖ... ముందే అమలు

వీసీ శారదా జయలక్ష్మీ ఫిబ్రవరి 25న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై మార్గదర్శకాలు తెలపాలని కోరినట్లు తెలిసింది. దీనిపై ఇంకా ప్రభుత్వం స్పందించలేదు. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతులు రాకముందే, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కొందరు ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలకు యూనివర్సిటీ తిరిగి పోస్టులు ఇచ్చింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులోనే ఇన్‌చార్జి వీసీ ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అటువంటి సమయంలో మూడేళ్లు సర్వీస్‌ పెంచుతూ నిర్ణయం తీసుకోవటం వల్ల ఆమెకు కూడా లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. తన వ్యక్తిగత లబ్ధి కోసం ఇన్‌చార్జి వీసీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారని అంటున్నారు. ఇదే అంశంపై రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Updated Date - Mar 17 , 2026 | 04:53 AM