Share News

హ్యాక్‌ చేశారా..? అమ్మేశారా?

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:15 AM

ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల లీకేజీ అంశంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తమ ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసి, కంటెంట్‌ దొంగిలించారని వీజీఎస్‌ పబ్లిషర్స్‌ వాదిస్తుండగా..

హ్యాక్‌ చేశారా..? అమ్మేశారా?

  • ఇంటర్‌ పుస్తకాల లీకేజీపై అనుమానాలు

  • తమ ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసి, కంటెంట్‌ను

  • దొంగిలించారంటున్న వీజీఎస్‌ పబ్లిషర్స్‌

  • హ్యాక్‌ చేస్తే.. ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు

  • కాపీలు వాట్సా్‌పలో ప్రత్యక్షమైన తర్వాత కంపెనీ స్పందన

  • కంటెంట్‌ను అమ్మేశారని విద్యార్థి సంఘాల ఆరోపణ

  • చర్యలు తీసుకోవడంలో అధికారుల తాత్సారం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల లీకేజీ అంశంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తమ ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసి, కంటెంట్‌ దొంగిలించారని వీజీఎస్‌ పబ్లిషర్స్‌ వాదిస్తుండగా.. కుట్రపూరితంగానే కంటెంట్‌ను బయటకు విక్రయించారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే లీకేజీ వ్యవహారం ఎలా జరిగినా.. దానికి బాధ్యత వహించాల్సిన వీజీఎస్‌ సంస్థపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తాత్సారం చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంపెనీని ఎవరో కాపాడుతున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల లీకేజీ వ్యవహారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్‌ బోర్డు సుదీర్ఘ కాలం కష్టపడి కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించగా, వీజీఎస్‌ పబ్లిషర్స్‌ ద్వారా కొందరు కంటెంట్‌ను దొంగలించి సోషల్‌ మీడియాలో పీడీఎఫ్‌ కాపీలు సర్క్యులేట్‌ చేయడం వివాదంగా మారింది.


ఒక్కో పాఠ్యపుస్తకంసైజ్‌ ఎక్కువ జీబీల్లో..

ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారిపోయాయి. గతేడాది ఫస్టియర్‌ పుస్తకాలను మార్చిన ఇంటర్‌ బోర్డు, అందుకు అనుగుణంగా ఈ ఏడాది సెకండియర్‌ పుస్తకాలనూ మార్చింది. దీంతో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కొత్త పాఠ్యపుస్తకాల కంటెంట్‌పై కన్నేశాయి. ఇంటర్‌ బోర్డు పాఠ్యపుస్తకాల ముద్రణ టెండరును తెలుగు అకాడమీ ద్వారా వీజీఎస్‌, విక్రమ్‌ కంపెనీలకు అప్పగించింది. టెండరు ఇచ్చిన వెంటనే వీజీఎస్‌ పబ్లిషర్స్‌ ద్వారా మొత్తం పాఠ్యపుస్తకాలు లీకైపోయాయి. దీనిపై వివరణ ఇవ్వాలని వీజీఎ్‌సను తెలుగు అకాడమీ కోరగా.. తమ ఈమెయిల్‌ హ్యాక్‌ చేసి కంటెంట్‌ తీసుకున్నారని ఆ కంపెనీ బదులిచ్చింది. అయితే ఒక్కో పాఠ్యపుస్తకం సైజ్‌ ఎక్కువ జీబీల్లో ఉంటుంది. ఒకవేళ మెయిల్‌ హ్యాక్‌ చేసి ఉంటే, ఒక్కో పుస్తకం కంటెంట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటిది అన్ని పుస్తకాలను హ్యాక్‌ చేసి తీసుకుపోతుంటే, వీజీఎస్‌ పబ్లిషర్స్‌ కనీసం ఎందుకు గుర్తించలేకపోయిందనే అనుమానం తెలెత్తుతోంది. తీరా పాఠ్యపుస్తకాల కాపీలు వాట్సా్‌పలో ప్రత్యక్షమైన తర్వాత ఆ కంపెనీ స్పందించింది. ఒకవేళ ఆ కాపీలు సోషల్‌ మీడియాలోకి రాకపోయుంటే ఈ లీకేజీ అంశం బయటకు రాకుండా యథేచ్ఛగా సాగిపోయేది. కాగా, గతంలో మెయిల్‌ను హ్యాక్‌ చేసి, కంటెంట్‌ను దొంగలించిన ఘటనలు ఎప్పుడూ జరగలేదు.


వీజీఎస్‌పై గతంలోనూ ఆరోపణలు

వీజీఎస్‌ పబ్లిషర్స్‌పై ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల కంటెంట్‌ను తీసుకుని బ్రిలియంట్‌ సిరీస్‌ పేరుతో స్టడీ మెటీరియల్‌ చేసిందని, దానిపై వివరణ ఇవ్వాలని అప్పట్లో పాఠశాల విద్యాశాఖ ఈ కంపెనీకి షోకాజు నోటీసులు ఇచ్చింది. గైడ్లు తయారు చేసే కంపెనీలకు పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యత అప్పగిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని స్థానిక చిన్న ప్రింటర్లు మొదటి నుంచీ వాదిస్తున్నారు. కానీ కొందరు అధికారులు ఎందుకో గానీ గైడ్లు, స్టడీ మెటీరియల్స్‌ ముద్రించే కంపెనీలపై ‘ప్రేమ’ చూపిస్తున్నారు. కంటెంట్‌ లీకయ్యే ప్రమాదం ఉందని తెలిసినా పెద్ద కంపెనీలకే ముద్రణ బాధ్యతలు ఇస్తుండటం గమనార్హం. కాగా, వీజీఎ్‌సను శాశ్వతంగా బ్లాక్‌ లిస్టులో పెట్టాలని, ఆ కంపెనీ రాష్ట్రంలో ప్రభుత్వ పుస్తకాలేవీ ముద్రించకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కంటెంట్‌ను కావాలనే అమ్ముకున్నారని, లీకేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Apr 06 , 2026 | 04:17 AM