Share News

సుత్తులు.. డ్రిల్లింగ్‌ మెషిన్లు!

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:43 AM

కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు వెనుక దాని యజమాని అడ్డగోలు నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి.

సుత్తులు.. డ్రిల్లింగ్‌ మెషిన్లు!

  • వేట్లపాలెం బాణాసంచా ప్రమాద స్థలంలో వెలుగులోకి..

  • జువ్వలు, చిచ్చుబుడ్లు, నారబాంబుల్లో మందు కూరింది వీటితోనే

  • కూరాక సుత్తులతో బాదే క్రమంలో నిప్పురవ్వలు.. పేలుడు!

  • బాణాసంచా తయారీ కేంద్రంలో వీటి వినియోగం నిషిద్ధం

కాకినాడ, కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు వెనుక దాని యజమాని అడ్డగోలు నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. 15 కిలోలకు మించి అక్కడ మందుగుండు తయారు చేయడానికి అనుమతులు లేవు. అయినా క్వింటాళ్ల కొద్దీ తయారు చేయడంతో విస్ఫోటం సంభవించి 23 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద స్థలంలో తాజాగా బూడిద అడుగున సుత్తులు, చేతి డ్రిల్లింగ్‌ మెషిన్లు కాలిన స్థితిలో కనిపించాయి. మందుగుండు కూరేందుకు వీటిని వినియోగించినట్లు స్పష్టమవుతోంది. జగ్గంపేట మండలం గోకవరంలో జరిగే జాతరకు భారీగా ఆర్డర్లు రావడంతో.. శనివారం ప్రమాదం జరిగిన శ్రీసూర్యఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో భారీగా తారాజువ్వలు, రంగుల చిచ్చుబుడ్లు, నారబాంబులు.. తయారుచేస్తున్నారు. అయితే బాంబుల్లో దట్టంగా మందుగుండు కూర్చేందుకు చేతి డ్రిల్లింగ్‌ యంత్రాలను ఉపయోగిస్తారు. గట్టిదనం కోసం వాటిపై సుత్తులతో బాదుతారు. ఇలా బాదినప్పుడు నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించి భారీ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు అంచనాకు వస్తున్నారు. నిబంధనల ప్రకారం బాణాసంచా తయారీ కేంద్రంలో సుత్తులు, డ్రిల్లింగ్‌ మిషన్ల వినియోగం నిషిద్ధం. కానీ శ్రీ సూర్య ఫైర్‌వర్క్స్‌ నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా వీటిని ఉపయోగించారు. నైపుణ్యం లేని కార్మికులు వీటిని వాడడం కూడా ప్రమాదానికి దారి తీసినట్లుగా భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సోమవారం ఇవి వెలుగులోకి వచ్చాయి. ఫోరెన్సిక్‌ బృందాలు వీటిని స్వాధీనం చేసుకున్నాయి.


వేరుపడిన తల ఆమెదే..

ప్రమాదంలో కార్మికుల అవయవాలు తునాతునకలై ఎగిరిపడ్డాయి. అతికష్టంపై మృతుల ఆనవాళ్లు గుర్తించి పోస్టుమార్టం అనంతరం 20 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఇందులో ఓ మృతదేహానికి తల లేదు. ప్రమాదం జరిగిన రోజు, ఆ మరుసటి రోజు ఆదివారం తల భాగం కోసం తీవ్రంగా వెదికారు. అయినా జాడ లేకపోవడంతో ఆదివారం బంధువులకు మొండెం మాత్రమే అప్పగించడంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. సోమవారం మధ్యాహ్నం ఘటనాస్థలానికి సమీపంలో తెగిపడిన తల కనిపించింది. మొండెం అప్పగించిన కుటుంబీకులను పిలిపించి చూపించగా తల భాగం సకుమాళ్ల రాఘవ (50)అనే మహిళదిగా గుర్తించారు. కాగా, ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీసూర్య ఫైర్‌ వర్క్స్‌ యజమాని అర్జున్‌, ఆయన సోదరుడు వీరబాబును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారికి ముడిసరుకు సరఫరా చేసిన పాలకుర్తి కనక సత్తిరాజును కూడా అరెస్ట్‌ చేశారు.


ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌

వేట్లపాలెం బాణాసంచా పేలుళ్ల ఘటనలో నలుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేయగా వారిలో ముగ్గురి సస్పెన్షన్‌ ఉత్తర్వులు సోమవారం వచ్చాయి. కాకినాడ జిల్లా అగ్నిమాపకశాఖాధికారి పీవీ సాయి రాజేశ్‌ను సస్పెండ్‌చేస్తూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపకశాఖ డీజీ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే లేబర్‌శాఖ రాజమహేంద్రవరం డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ కాకినాడ జిల్లాకు ఎఫ్‌ఏసీగా ఉన్న బీఎ్‌సఎం వల్లిని సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పెద్దాపురం ఆర్డీవో రమణిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Mar 03 , 2026 | 04:43 AM