Share News

అస్మదీయ కంపెనీలొచ్చేశాయ్‌..!

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:13 AM

ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు టెండర్లలో అధికారులు నిబంధనలకు పాతరేస్తున్నారు. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్ఐడీసీ)లో...

అస్మదీయ కంపెనీలొచ్చేశాయ్‌..!

  • వెంటిలేటర్ల టెండర్లకు రీ-డెమో

  • గతంలో డిస్‌క్వాలిఫై అయిన కంపెనీలు..ఇప్పుడు అర్హత సాధించడంపై విమర్శలు

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు టెండర్లలో అధికారులు నిబంధనలకు పాతరేస్తున్నారు. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్ఐడీసీ)లో కొన్ని ముఖ్యమైన టెండర్లను అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రూల్స్‌ను ప్రవేశపెడుతున్నారు టెండర్‌ ప్రక్రియలో సాంకేతిక పరిశీలనతో పాటు వైద్య పరికరాల డెమో కూడా ముగిసిన తర్వాత.. అస్మదీయ కంపెనీలను ఎంపిక చేసేందుకు రీ-డెమోకు అనుమతిచ్చారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఆస్పత్రుల్లో రోగులకు అత్యవసర సమయంలో ఉపయోగించే వెంటిలేటర్ల టెండర్లలోనూ ఇదే చేశారు. వెంటిలేటర్ల కొనుగోలు టెండర్లలో ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. దీనికి సంబంధించిన సాంకేతిక పరిశీలన, డెమో గత నెలల్లో ముగిశాయి. కానీ కార్పొరేషన్‌ ఉన్నతాధికారికి నచ్చి మెచ్చిన కంపెనీ డిస్‌క్వాలిఫై అయింది. దానికి అర్హత కల్పించాలన్న ఉద్దేశంతో మరోసారి డెమోకు అవకాశం కల్పించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. మంగళవారం రీ-డెమో నిర్వహించారు. విచిత్రం ఏమిటంటే.. గత నెలలో నిర్వహించిన డెమోలో డిస్‌క్వాలిఫై అయిన కంపెనీలు ఇప్పుడు అనూహ్యంగా అర్హత సాధించాయి. రీ-డెమోలో నాలుగు కంపెనీలు పాల్గొనగా.. నాలుగింటికీ అధికారులు అర్హత కల్పించేశారు. ఓ ఢిల్లీ కంపెనీకి అర్హత కల్పించేందుకు నిబంధనలకు విరుద్ధంగా రీ-డెమోకు అవకాశం కల్పించారు.మరోవైపు ఆపరేషన్‌ థియేటర్లలో లైట్ల కొనుగోలు టెండర్లలో 11 కంపెనీలకు గాను రెండు కంపెనీలు అర్హత సాధించాయి. అనస్తీషియా మెషీన్ల టెండర్లలో ఐదు కంపెనీలు పాల్గొంటే.. ఒక్కటే అర్హత పొందింది. ఈ రెండు టెండర్లకు మాత్రం రీ-డెమో అవకాశం కల్పించలేదు.

Updated Date - Apr 29 , 2026 | 05:13 AM