Share News

మంచిగా దుస్తులు ధరించాలని చెప్పడం తప్పా?

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:34 AM

మంచిగా దుస్తులు కట్టుకోమని చెబితే కూడా వివాదాస్పదం అవుతోంది. దుస్తులు కట్టుకోవద్దు అంటే తప్పు కానీ మంచిగా దుస్తులు ధరించమని చెప్పడం కూడా తప్పు అవుతుందా...

మంచిగా దుస్తులు ధరించాలని చెప్పడం తప్పా?

  • కట్టుకోవద్దంటే కదా తప్పు: వెంకయ్య

  • హైదరాబాద్‌లో వేటూరి సాహితీ మహోత్సవం

హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ‘మంచిగా దుస్తులు కట్టుకోమని చెబితే కూడా వివాదాస్పదం అవుతోంది. దుస్తులు కట్టుకోవద్దు అంటే తప్పు కానీ మంచిగా దుస్తులు ధరించమని చెప్పడం కూడా తప్పు అవుతుందా? పైగా వాటి మీద వాద, ప్రతివాదనలు, వివాదాలు’ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. వేటూరి 90వ జయంతి సందర్భంగా వేటూరి సాహిత్యాభిమానుల సమితి (అమెరికా) నిర్వహణలో బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళా వేదికలో కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథి వెంకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేటూరి సినీ, సినీయేతర సాహిత్యం 6 సంపుటాలను ఆవిష్కరించారు. ఆయనను పాటల తోటమాలిగా అభివర్ణించారు. పాత రోజుల్లో హీరో, హీరోయిన్‌ తాకకుండానే శృంగార సన్నివేశాలు పండించేవారన్నారు. ఇప్పటి సినిమాల్లో హీరో హీరోయిన్‌ను తాకినా, గోకినా సన్నివేశం పండడం లేదన్నారు. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన హోదా సాధన ఉద్యమానికి ఆద్యుడు వేటూరి అన్నారు. భారత ప్రభుత్వ చీఫ్‌ సైంటిఫిక్‌ సలహాదారు జి.సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. క్షిపణుల పరిశోధనల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వేటూరి పాటలు విని ఉపశమనం పొందిన సందర్భాలెన్నో ఉన్నాయని చెప్పారు. తోటకూర ప్రసాద్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేటూరి సుందర రామమ్మూర్తి భార్య సీతామహాలక్ష్మి, పెద్ద కుమారుడు రవి ప్రకాశ్‌, సినీ నటుడు తనికెళ్ల భరణి, గేయ రచయితలు జొన్నవిత్తుల, చంద్రబోస్‌, సంగీత దర్శకులు మాదవపెద్ది సురేశ్‌, మణిశర్మ, కోటి, రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు వీఎన్‌ ఆదిత్య, గాయకులు ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 04:34 AM