కన్న కొడుకుతో కలిసి అగ్నికి ఆహుతి
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:20 AM
ఆ కన్నతల్లి మనసును ఏ కష్టం ముక్కలు చేసిందో.. పేగు తెంచుకొని పుట్టిన తొమ్మిదేళ్ల పసి ప్రాణాన్ని కూడా వెంట తీసుకొని అనంత లోకాలకు వెళ్లిపోయింది.
వెంకటగిరిలో గుండెలు పగిలే విషాదం
కొడుకుతో సహా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న పురోహితుడి భార్య
ఆ కడుపుకోతకు కారణమేంటో?.. పోలీసు దర్యాప్తు ప్రారంభం
వెంకటగిరి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఆ కన్నతల్లి మనసును ఏ కష్టం ముక్కలు చేసిందో.. పేగు తెంచుకొని పుట్టిన తొమ్మిదేళ్ల పసి ప్రాణాన్ని కూడా వెంట తీసుకొని అనంత లోకాలకు వెళ్లిపోయింది. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కాశీతోటలో సోమవారం రాత్రి ఈ పెనువిషాదం చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. అరవ బ్రాహ్మణ వీధికి చెందిన లీలా బాలశ్రావణి(35), సోమవారం సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చిన కొడుకు చంద్ర మౌళి(9)తో.. తినుబండారాలు కొనిస్తా రా అంటూ స్కూటీపై ఎక్కించుకొంది. మధ్యలో పెట్రోల్ బంకు వద్ద ఆగి ఓ బాటిల్లో పెట్రోల్ కొనుగోలు చేసింది. నేరుగా కాశీవిశ్వనాథ దేవస్థానాన్ని దాటుకొని కాశీతోటలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లింది. అక్కడ ముందుగా తనపై, తరువాత కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకొంది. మంటలతో నరకయాతన భరించలేక ఆ బాలుడు గాయాలతో రోడ్డు పైకి పరిగెత్తుకొంటూ వచ్చాడు. అటుగా వెళుతున్న ఆటోను ఆపి రోదిస్తూ తన తండ్రి ఫోన్‌నంబర్ ఇచ్చి సమాచారం అందించాలని డ్రైవర్‌ను వేడుకొన్నాడు. చలించిపోయిన ఆటోడ్రైౖవర్ వెంటనే బాలుడి తండ్రి నాగశర్మకు సమాచారం అందించాడు. ఈ లోగా ఆ బాలుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇంతలో తండ్రి అక్కడికి చేరుకొని కొడుకును తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ పసి ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయిం ది. తల్లి లీలా బాలశ్రావణి అంతకు ముందే ఘటనా స్థలంలోనే సజీవ దహనమైంది. డక్కిలి మండలం ఎమ్ముళూరుకు చెందిన నాగేశ్వర శర్మ, లీలా బాలశ్రావణికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వెంకటగిరిలో ని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణ స్వామి దేవస్థానంలో నాగేశ్వర శర్మ ప్రధాన అర్చకుడిగా సేవలందిస్తున్నాడు. లీలాశ్రావణి కుడా ఆలయ నిర్వహణలో భర్తకు తోడుగా ఉండేది. బయటకు ఎంతో అనోన్యంగా ఉండే ఈ సంప్రదాయ కుటుంబంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం స్థానికులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది
తప్పించుకున్న కుమార్తె..
ఈ దంపతులకు కుమార్తె కూడా ఉంది. ఘటన జరిగిన సమయంలో ఆ చిన్నారి బయటకు ఆడుకోవడానికి వెళ్ళడంతో ప్రమాదం నుంచి తప్పించుకొంది. లేదంటే ఆతల్లి ఆ చిన్నారిని కూడా వెంట తీసుకు వెళ్లేదేమోనని స్థానికులంటున్నారు. సమాచారం అందడంతో సీఐ రోశయ్య సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లి, కొడుకు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నాగేశ్వర శర్మ సొంత గ్రామమైన వెంబులూరులో విషాద ఛాయలు అలుముకొన్నాయి.