ప్రజా ప్రతినిధులకు శిక్షణ అవసరం
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:00 AM
‘రాజకీయాల్లో విలువలు పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులకు కూడా శిక్షణ అవసరం’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
తెలుగు భాషకు ‘మండలి’ చేసిన సేవలు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు
సభలో తెలుగులో మాట్లాడకపోతే మైక్ కట్: స్పీకర్ అయ్యన్న
విజయవాడలో మండలి కృష్ణారావు శతజయంతి ముగింపు వేడుకలు
విజయవాడ కల్చరల్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో విలువలు పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులకు కూడా శిక్షణ అవసరం’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సృజనాత్మకత, సంస్కృతి సమితి(భాషా సాంస్కృతిక శాఖ), మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘ప్రస్తుతం అసెంబ్లీల్లో కనిపిస్తున్న తీరు బాధను కలిగిస్తోంది. విలువలు, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం, ప్రజలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలు సమష్టిగా కృషి చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేయాలి. మండలి వెంకట కృష్ణారావు దేశం, సమాజం, తెలుగు భాష కోసం విశిష్ట సేవలు అందించిన మహనీయుడు’ అన్నారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ‘ఉద్యోగి విధులకు హాజరుకాకపోతే జీతం ఉండదు. అదే సూత్రం ఎమ్మెల్యేలకూ వర్తించాలి. శాసనసభలో ప్రతి ఎమ్మెల్యే తెలుగులోనే మాట్లాడాలని స్పీకర్‌గా నిర్ణయం తీసుకున్నా.
ఇకపై తెలుగులో మాట్లాడనివారికి మైక్ ఇవ్వబోను’ అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ‘ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు’ అన్నారు. మరో మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ, ‘‘దివిసీమ ఉప్పెన సమయంలో చేసిన సేవల వల్లే ఆయన ‘దివిసీమ గాంధీ’గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు’’ అన్నారు. కేరళలోని కొచ్చిన్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు హరిహర నాయుడుకు ‘మండలి వెంకట కృష్ణారావు భాషా సాంస్కృతిక సేవా పురస్కారం’ ప్రదానం చేశారు. ‘అజాతశత్రువు-ఆదర్శనేత మండలి వెంకట కృష్ణారావు’, ‘కృష్ణా మండలి గేయకావ్యం’ పుస్తకాలను ఆవిష్కరించారు. అరవింద ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘మహాపురుషుడు మండలి’ నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, ప్రొఫెసర్ డి.మునిరత్నం నాయుడు, పి.త్రివిక్రమరావు, మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మండలి వెంకట కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నిరాడంబర జీవనానికి ప్రతీక మండలి: పవన్
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాజకీయాన్ని ప్రజాసేవకు బాటగా మలచుకుని, ప్రతి అడుగులో ప్రజాహితాన్ని ముందుకు తీసుకువెళ్లిన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకులు మాజీ మంత్రి, దివంగత మండలి వెంకట కృష్ణారావు అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ‘మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తూ నిరాడంబర జీవనాన్ని సాగించిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయం. 1975 మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగు ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితం చేశారు. తెలుగుజాతికి ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ, ఆ మహానీయుడికి ఘన నివాళులు ఆర్పిస్తున్నా’ అని పవన్ తెలిపారు.